కోతుల‌కు విషం పెట్టి చంపిన మ‌నుషులు

30 Monkeys Killed in Karnataka. కోతుల‌కు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి.

By Medi Samrat  Published on  29 July 2021 11:23 AM GMT
కోతుల‌కు విషం పెట్టి చంపిన మ‌నుషులు

కోతుల‌కు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లా బెలూర్ స‌మీపం చౌడనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం రోడ్డు పక్కన స్థానిక యువకులు కొన్ని గోనెసంచుల మూటలను గుర్తించారు. ఆ యువ‌కులు వాటిని తెరిచిచూడ‌గా అందులో కోతులు కన్పించాయి. అయితే.. అప్ప‌టికే కొన్ని సంచుల్లో ఉన్న కోతులు మరణించగా.. మరికొన్ని తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాయి.

సంచుల‌లో ఉన్న వానరాల్లో 30 కోతులు చనిపోగా.. మరో 20 తీవ్రంగా గాయపడ్డాయి. యువకులు గాయపడిన కోతులను బయటకు తీసి నీళ్లు తాగించ‌డంతో పాటు ప్ర‌థ‌మ చికిత్స చేశారు. దీంతో గాయ‌ప‌డ్డ కోతుల‌లో 18 కోలుకోగా.. మరో రెండింటిని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘ‌ట‌న‌పై సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కోతులకు విషం పెట్టి, సంచుల్లో కుక్క‌డ‌మే కాకుండా.. సంచులపై బలంగా కొట్టి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మరణించిన కోతుల‌కు పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టులో విషం ఆనవాళ్లు ఉన్నట్లు తేలిన‌ట్లు స‌మాచారం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ నటుడు రణ్‌దీప్‌ హుడా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ ఘ‌ట‌న‌కు కార‌కులైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు.
Next Story
Share it