కరోనా సెకండ్ వేవ్ లో పిట్ట‌ల్లా రాలిపోతున్న ప్రజల ప్రాణాలు నిలబెట్టడం కోసం.. తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వారిలో వైద్యులు కూడా ఉన్నారన్నది ఎంత నిజమో.. కొన్ని చోట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలను ఇబ్బంది పెడుతోంది అనే మాట కూడా అంతే నిజం. సామాన్యులే కాదు పలువురు నేతలు కూడా ఇదే మాట చెబుతున్నారు. ప్రయివేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు చనిపోయాడని, దీనిపై చేసిన ఫిర్యాదును పోలీసులు కనీసం పట్టించుకోలేదని ఓ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల నుంచి మొరపెట్టుకున్నా ఎఫ్ఐఆర్ ను కూడా నమోదుచేయలేదని యూపీలోని శాండిలా నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్‌కుమార్ అగర్వాల్ వాపోతున్నారు. డాక్టర్ల పైనే కాదు స్థానిక పోలీసులు పైన ఆరోపణలు గుప్పించారు.

ఎమ్మెల్యే కుమారుడు ఆశిష్ కోవిడ్ బారిన పడటంతో అతడిని కకోరిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చించారు. ఆశిష్ చికిత్స పొందుతూ ఏప్రిల్ 26న మరణించాడు. అయితే, ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. చనిపోయిన రోజు ఉదయం వరకూ ఆశిష్ బాగానే ఉన్నాడని, ఆహారం తీసుకున్నాడని అన్నారు. అప్పటికి ఆక్సిజన్ లెవెల్స్ 94గా ఉన్నాయని, అయితే సాయంత్రానికే ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినట్టు వైద్యులు చెప్పారన్నారు. ఆసుపత్రిలో సిలిండర్ల కొరత ఉండటంతో.. బయట నుంచి ఆక్సిజన్ సిలిండర్‌ను తీసుకొచ్చామని అయితే దానిని లోపలకు అనుమతించలేదని వాపోయారు.

ఆస్పత్రి యాజమాన్యం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తున్న ఆయన ఎంత ప్రయత్నిస్తున్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేయడం లేదని అన్నారు. ఆస్పత్రిలోఅదే రోజు ఏడుగురు చనిపోయారనీ దీని గురించి సీఎం, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, డీజీపీలకు ఫిర్యాదు చేశారు.ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌లను విశ్లేషించి, తన కుమారుడి మరణానికి కారకులైనవారికి గుర్తించమని కోరారు. ఈ విధమైన ఇబ్బందులను మరెవరూ అనుభవించ కూడదన్నారు..అందుకే ఆసుపత్రిపై కేసు పెట్టాలని ముందుకు వచ్చానన్నారు.

ఈ విషయంపై, కాకోరికి చెందిన ఇన్‌స్పెక్టర్ బ్రిజేష్ సింగ్ స్పందించారు. మూడు రోజుల క్రితమే తాను బాధ్యతలు స్వీకరించానని, ఈ విషయంలో పాత ఇన్స్పెక్టర్ నుండి ఎటువంటి సమాచారము లేదని, ఇప్పుడు ఈ ఫిర్యాదు తర్వాత మళ్లీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.


జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story