బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు కర్నాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర సోమవారం తెలిపారు. మీడియాతో ఆరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ.. ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉన్నట్లు భావిస్తున్నామని.. అయితే వీరి వెనుక ఎవరున్నారనేది ఇంకా తెలియరాలేదని అన్నారు. "ఓవరాల్‌గా మూడు అరెస్ట్‌లు జరిగాయి. వారిని ఎక్కడికి తీసుకువెళ్లారు అనేది.. నేను ఇంతకు మించి వెల్లడించలేను" అని జ్ఞానేంద్ర అన్నారు. కస్టడీలోకి ఎంతమందిని తీసుకున్నారనేది నా దగ్గర ఖచ్చితమైన సంఖ్య లేదు. విచారణ తర్వాత ప్రధాన ఉద్దేశ్యం బయటకు వస్తుందిష అని అన్నారాయన.
శివమొగ్గలో చెలరేగిన హింసపై హోంమంత్రి మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో 1,200 మంది అదనపు పోలీసులను మోహరించారు. బెంగళూరు నుంచి 200 మందికి పైగా పోలీసులను పంపినట్లు ఆయన తెలిపారు. ఏడీజీపీ మురుగన్ కూడా సమస్యను చూస్తున్నారని, శాంతిభద్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు. ఈ మధ్యాహ్నం హర్ష మృతదేహాన్ని అంత్యక్రియల స్థలానికి తీసుకెళ్లినప్పుడు.. పరిస్థితిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప, బీజేపీ ఎంపీ రాఘవేంద్ర హాజరయ్యారని అరగ జ్ఞానేంద్ర తెలిపారు.