ఢిల్లీ చేరిన రెండో విమానం.. ఏపీ, తెలంగాణ భవన్ లకు చేరుకున్న తెలుగు విద్యార్థులు
2nd Evacuation Flight With 250 Indians From Ukraine Lands In Delhi.ఉక్రెయిన్ పై రష్యా యుద్దం నేపథ్యంలో అక్కడ
By తోట వంశీ కుమార్ Published on 27 Feb 2022 8:48 AM ISTఉక్రెయిన్ పై రష్యా యుద్దం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి ఆపరేషన్ గంగ పేరుతో కేంద్రం అన్నీ ప్రయత్నాలు చేస్తోంది. రొమేనియా, హంగేరి, పోలాండ్ దేశాల మీదుగా విద్యార్థులను ఎయిర్ ఇండియా విమానాల్లో స్వదేశానికి తీసుకువస్తున్నారు. 250 మంది భారతీయ పౌరులతో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుండి రెండవ విమానం ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ విద్యార్థులకు స్వాగతం పలుకడంతో పాటు వారితో మాట్లాడారు.
ఢిల్లీ చేరుకున్న వారిలో 28 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన వారు 17 మంది ఉండగా.. ఏపీకి చెందిన వారు 11 మంది ఉన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారిని ఉచితంగా తీసుకురావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ అధికారులు విద్యార్థులను తెలంగాణ భవన్‌కు తీసుకువెళ్లారు. ఈ రోజు సాయంత్రం కల్లా వారిని తెలంగాణకు తీసుకురానున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులను ఏపీ భవన్‌కు తీసుకువెళ్లారు. ఏపీ భవన్‌లో ఉన్న 11 మంది విద్యార్థుల్లో ఉదయం 9 గంటలకు ముగ్గురు బెంగళూరుకు, మధ్యాహ్నాం 12 గంటలకు 5గురు విజయవాడకు, సాయంత్రం 6 గంటలకు ముగ్గురు విద్యార్థులు విశాఖకు చేరుకోనున్నట్లు ఏపీ భవన్ అధికారులు తెలిపారు. కాగా.. ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 550 మంది విద్యార్థులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి 260, తెలంగాణ నుంచి 275 మంది వైద్య విద్యార్థులు ఉక్రెయిన్‌లో చదువుతున్నట్లు అంచనా.