అగ్నిప్ర‌మాదంలో 27 మంది స‌జీవ ద‌హ‌నం.. ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ప్ర‌ధాని మోదీ

27 Killed in massive fire engulfs three storey building near Mundka Station.దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన భారీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2022 3:36 AM GMT
అగ్నిప్ర‌మాదంలో 27 మంది స‌జీవ ద‌హ‌నం.. ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ప్ర‌ధాని మోదీ

దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన భారీ అగ్నిప్ర‌మాదంలో 27 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ముండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని మూడంతస్తుల భవంతిలో శుక్ర‌వారం సాయంత్రం ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. దాదాపు 60 నుంచి 70 మందిని రక్షించిన‌ట్లు పోలీసులు తెలిపారు. 40 మందికి పైగా గాయ‌ప‌డ్డార‌ని వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

భ‌వ‌నం మొద‌టి అంత‌స్థులో ఉన్న సీసీటీవీ కెమెరా, రూటర్లను తయారు చేసే కంపెనీ కార్యాల‌యం నుంచి తొలుత మంట‌లు చెల‌రేగాయి. నిమిషాల వ్య‌వ‌ధిలోని అన్ని ఫ్లోర్ల‌కు మంట‌లు వ్యాపించాయి. స‌మాచారం అందుకున్న వెంట‌నే 24 ఫైర్ ఇంజిన్లు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పి వేశాయి. కాగా.. సీసీటీవీ కెమెరా, రూటర్లను తయారు చేసే కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భ‌వ‌నంలో ఎలాంటి భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించ‌లేద‌ని, షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని అధికారులు ప్రాథ‌మికంగా నిర్థార‌ణ‌కు వ‌చ్చారు.

ఈ దుర్ఘ‌టనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారం ప్ర‌క‌టిస్తూ ప్ర‌ధాని కార్యాల‌యం ట్వీట్ చేసింది.

'ఈ ఘ‌ట‌న గురించి తెలిసి షాక్‌కు గుర‌య్యాను. అధికారుల‌తో నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రుపుతున్నా.అగ్నిమాప‌క సిబ్బంది వారి జీవితాల‌ను కాపాడేందుకు ఎంతో శ్ర‌మిస్తున్నారు 'అని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Next Story