241 కంపెనీలకు రూ. 4369 కోట్ల జరిమానా విధించిన సీసీఐ.. ఎందుకంటే..

241 companies fined Rs 4369 Cr for unhealthy competition. కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (CCI), 241 కంపెనీలపై 4369.39 కోట్ల జరిమానాను

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 July 2022 2:45 PM GMT
241 కంపెనీలకు రూ. 4369 కోట్ల జరిమానా విధించిన సీసీఐ.. ఎందుకంటే..

కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (CCI), 241 కంపెనీలపై 4369.39 కోట్ల జరిమానాను విధించింది. అనారోగ్య వ్యాపార పద్ధతులను అవలంభించినందుకు ఈ జరిమానా విధించారు. ఈ జరిమానా విధించబడ్డ కంపెనీలలో గూగుల్, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో ఎయిర్‌లైన్స్, భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, హైదరాబాద్ ఆధారిత - హెటెరో హెల్త్‌కేర్, అదానీ ట్రాన్స్‌మిషన్, 6 యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కార్ల్స్‌బర్గ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. ఎవెరెడీ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్, జెట్ ఎయిర్‌వేస్, ఈఎస్‌సిఎల్, సౌత్ ఏషియా ఎల్‌పిజి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, బజాజ్ హిందుస్థాన్ లిమిటెడ్, ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వంటి కొన్ని కంపెనీలపై విధించిన పెనాల్టీలు వందల కోట్లలో ఉన్నాయి. 2017 నుండి 2022 మధ్య ఈ జరిమానా విధించబడింది. పోటీ ఉల్లంఘన చట్టం కింద ఈ జరిమానాలను విధించారు.



CCI- అనేది బ్రాండ్‌ల మధ్య ఆధిపత్య దుర్వినియోగాన్ని నిషేధించే నియంత్రణ సంస్థ. ఇది ప్రాథమికంగా భారతీయ మార్కెట్లలో సరసమైన పోటీని ప్రోత్సహించడానికి, నిబంధనలను పట్టించుకోని సంస్థలకు జరిమానా విధిస్తూ ఉంటుంది. పోటీపై ప్రతికూల ప్రభావాలను కలిగించే పద్ధతులను తొలగించడానికి, పెద్ద కంపెనీల ఆధిపత్యం ఉన్నప్పుడల్లా మార్కెట్‌ను రక్షించడానికి CCI బాధ్యత తీసుకుంటూ ఉంటుంది. అయితే చాలా కంపెనీలు ఇప్పటి వరకూ పెనాల్టీని చెల్లించలేదు. 4369.39 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా.. కేవలం 197.88 కోట్లు మాత్రమే చెల్లించారు. CCI విధించిన మిగిలిన జరిమానాలు ట్రిబ్యునల్స్ ద్వారా నిలిపివేయబడ్డాయి.. లేదా పక్కన పెట్టబడ్డాయి. ఇక కొన్ని కంపెనీలు డిపాజిట్ చేయాల్సిన సమయం ఇప్పటికే ముగిసిపోయింది.


ఫిబ్రవరి 2022లో, CCI రూ. 1788 కోట్ల జరిమానాను సవాలు చేస్తూ ప్రముఖ టైర్ల తయారీ కంపెనీలు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతకుముందు 2018లో.. CCI అపోలో టైర్స్, MRF, CEAT, JK టైర్స్, బిర్లా టైర్‌లకు వ్యతిరేకంగా ధరలను మార్చేందుకు చేతులు కలిపినందుకు విరుచుకుపడింది. ఇది పోటీకి వ్యతిరేకమైనదిగా పరిగణించారు. పిటీషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు చెడు పద్ధతులకు దూరంగా ఉండాలని ఈ కంపెనీలను కోరింది.


2018లో రూ.6300 కోట్ల పెనాల్టీపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో 11 సిమెంట్ తయారీ కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ కంపెనీలు సిండికేట్ గా ఏర్పడి అనారోగ్యకరమైన పోటీ పద్ధతులకు పాల్పడుతున్నాయని CCI వాదించింది. అయితే, సుప్రీంకోర్టు పెనాల్టీ మొత్తాన్ని తగ్గించి.. మొత్తం జరిమానాలో 10% మాత్రమే డిపాజిట్ చేయాలని కోరింది.

"కార్పొరేట్ సంస్థలకు CCI యొక్క ఉత్తర్వును (జరిమానాల గురించి) సవాల్ చేసే చట్టపరమైన హక్కు ఉంది. కోర్టు తలుపులు తట్టడం వారి రాజ్యాంగ హక్కు. కానీ, ఈ వ్యవస్థీకృత విధానాలు జాప్యాలకు దారి తీస్తోంది. CCI జరిమానా డబ్బును సేకరించి ఎస్క్రో బ్యాంక్ ఖాతాలో పెట్టాలి" అని ఆర్థిక మంత్రి మాజీ సలహాదారు మోహన్ గురుస్వామి న్యూస్‌మీటర్‌తో అన్నారు. "A కంపెనీకి రూ. 10 కోట్లు జరిమానా విధించబడిందనుకుందాం.. CCI తప్పనిసరిగా A నుండి జరిమానా వసూలు చేసి, కంపెనీకి లేదా CCIకి దానిపై అధికారం లేని ఎస్క్రో బ్యాంక్ ఖాతాలో పెట్టాలి. కంపెనీ కోర్టులో ఉపశమనం పొందినట్లయితే జరిమానా మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు" అని అన్నారు.



















Next Story