బెంగళూరులో దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత నీటి ఎద్దడి ఎదుర్కొంటూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్లను శుభ్రపరచడం వంటి అనవసరమైన పనుల కోసం తాగునీటిని వృధా చేశారన్న ఆరోపణలపై బెంగళూరులోని అధికారులు 22 కుటుంబాలకు జరిమానా విధించారు. బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (BWSSB) కేవలం మూడు రోజుల్లో రూ. 1.10 లక్షల జరిమానా వసూలు చేసింది. బెంగళూరు వాసులు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటివరకు వసూలు చేసిన మొత్తం 1.10 లక్షల్లో కేవలం నగరంలోని నైరుతి ప్రాంతంలోనే రూ.65,000 జరిమానాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో వాహనాలను శుభ్రపరచడం, తోటపని, భవనాల నిర్మాణం, రన్నింగ్ ఫౌంటైన్లు మొదలైన వాటికి నీటిని ఉపయోగించడంపై BWSSB నిషేధం విధించింది. నగరంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, గత కొద్దిరోజులుగా వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయని, ఫలితంగా నగరంలో నీటి వృథాను అరికట్టాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు త్రాగునీటిని పొదుపుగా ఉపయోగించాలని BWSSB ఆర్డర్ సూచించింది.