డెల్టా ప్లస్ వేరియంట్ తో రెండో మరణం.. మహారాష్ట్రలో మళ్లీ కలకలం
22 Cases of Delta Plus Variant Found in 7 Districts. డెల్టా ప్లస్ వేరియంట్ ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో డెల్టా ప్లస్
By Medi Samrat
డెల్టా ప్లస్ వేరియంట్ ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా రెండో మరణం నమోదైంది. ప్రజారవాణా, లోకల్ రైళ్లపై కొనసాగుతున్న ఆంక్షలు పొడిగించాలని భావిస్తున్నట్లు సమాచారం. కోవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. థర్డ్‌వేవ్ ఆందోళనల నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టి సారించి, సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది.
'డెల్టా ప్లస్' రకం మరింత విజృంభించకముందే ఆంక్షల స్థాయిని పెంచింది మహా రాష్ట్ర ప్రభుత్వం. అన్ని జిల్లాల్లోనూ 'లెవెల్ 3' ఆంక్షలను అమలు చేయాల్సిందిగా అధికారులను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీతారామ్ కుంతీ ఆదేశించారు. అందుబాటులో ఉన్న ఆసుపత్రి పడకలతో సంబంధం లేకుండా ఆంక్షలను అమలు చేయాలని ఉత్తర్వులిచ్చారు. జన్యు మార్పులతో రకరకాల కరోనాలు పుట్టుకొస్తున్నాయి. వాటి వల్ల రోగనిరోధక వ్యవస్థను శక్తిమంతం చేసే ప్రతిరక్షక స్పందన తగ్గిపోతోందని.. రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటిపోక ముందే అన్ని జిల్లాలూ లెవెల్ 3 ఆంక్షలను అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డెల్టా ప్లస్ వేరియంట్ నమోదైన తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు తీసుకోవాల్సిన చర్యలను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు. దేశంలో ఇప్పటి వరకు 45, 000 పరీక్షలు చేయగా.. 51 కేసులు గుర్తించినట్లు తెలిపారు.డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో 22, తమిళనాడులో తొమ్మిది, మధ్యప్రదేశ్‌లో ఏడు, కేరళలో మూడు, పంజాబ్, గుజరాత్‌లలో రెండేసి కేసులు ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) డైరెక్టర్ సుజిత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, కర్ణాటకలో ఒక్కో కేసు నమోదైంది.