రికార్డ్‌.. 21 ఏళ్లకే మేయర్ ప‌ద‌వి

21 Year Old Kerala Woman Elected as Mayor. మేయ‌ర్ ఎన్నిక‌ల్లో కేర‌ళ రాజ‌ధాని తిరువనంతపురం ఇప్పుడు జాతీయ స్థాయిలో

By Medi Samrat  Published on  26 Dec 2020 6:18 AM GMT
రికార్డ్‌.. 21 ఏళ్లకే మేయర్ ప‌ద‌వి

మేయ‌ర్ ఎన్నిక‌ల్లో కేర‌ళ రాజ‌ధాని తిరువనంతపురం ఇప్పుడు జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించ‌నుంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా 21 ఏళ్ల వ‌య‌సులో ఆర్యా రాజేంద్ర‌న్ మేయ‌ర్ పీఠాన్ని అధిష్టించ‌నున్నారు. దేశంలోనే పిన్నవయసులో మేయర్‌ పదవికి ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించేందుకు ఆర్యన్‌ రాజేంద్రన్‌ సిద్ధమవుతున్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గం ఈమేరకు ఆమెను కేరళ రాష్ట్రం తిరువనంతపురం మేయర్‌ పదవికి ఎంపిక చేయాలని నిర్ణయించింది. దీంతో 21 ఏళ్ల ఆర్య ఎంపిక లాంఛనం కానుంది.

ఆర్య‌ ప్రస్తుతం న్యాయవిద్య అభ్యసిస్తున్నారు. ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె తిరువనంతపురం మున్సిపాలిటీ పరిధిలోని ముదవన్‌ముగల్ వార్డు నుంచి అధికార లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (LDF) పార్టీ నుంచి బరిలో నిలిచారు. విపక్ష కూటమి నుంచి పోటీ చేసిన సీనియర్‌ అభ్యర్థిని ఓడించి వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.

ఆర్య మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ప్రస్తుతం స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. సీపీఎం అనుబంధసంస్థ.. బాలసంఘానికి ఆమె రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. మేయర్‌ పదవికి తన పేరు ఖరారుకావడంతో ఆమె ఆనందం వ్యక్తంచేశారు. పిన్న వయసులోనే మేయర్ పదవి వరించడంలో భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.


Next Story
Share it