పశ్చిమ బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తనతో ప్రత్యక్షంగా టచ్‌లో ఉన్నారని బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి మరోసారి ప్రకటించారు. కోల్‌కతాలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ, 21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నారు, నేను ఇంతకు ముందే చెప్పాను.. నేను నా మాటలకు కట్టుబడి ఉన్నాను. సమయం కోసం వేచి ఉండండి." అని చెప్పుకొచ్చారు. తృణమూల్ నేతలను తీసుకోవడంపై పార్టీలో అభ్యంతరాలున్నాయని తనకు తెలుసునని అన్నారు మిథున్ చక్రవర్తి.
శనివారం దుర్గాపూజకు ముందు మిథున్ చక్రవర్తి నగరంలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్న TMC ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందా అనే ప్రశ్న ఎదురైంది. చక్రవర్తి మాట్లాడుతూ.. "నేను మీకు ఖచ్చితమైన సంఖ్యను చెప్పను, కానీ సంఖ్య 21 కంటే తక్కువ కాదని చెప్పగలను" అన్నారు. కేంద్ర సంస్థల దుర్వినియోగం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు.