స్వాతంత్ర్య దినోత్సవం నాడు బీహార్ యువ‌త‌కు బంఫ‌ర్ గిప్ట్ ఇచ్చిన సీఎం

20 lakh jobs for Bihar youth. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం

By Medi Samrat  Published on  15 Aug 2022 1:00 PM GMT
స్వాతంత్ర్య దినోత్సవం నాడు బీహార్ యువ‌త‌కు బంఫ‌ర్ గిప్ట్ ఇచ్చిన సీఎం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా రాష్ట్రంలోని యువతకు 20 లక్షల ఉద్యోగాలు ప్రకటించారు. ఇక్కడి చారిత్రాత్మక గాంధీ మైదాన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం నితీష్ కుమార్ ప్రసంగిస్తూ.. '10 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా.. ఆ సంఖ్యను రెట్టింపు చేయాలని అనుకుంటున్నాం' అని అన్నారు.

''రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే మా ఆశయం. ఇప్పుడు కొత్త తరం (తేజస్వి యాదవ్) మాతో వచ్చారు. కాబట్టి.. బీహార్ యువ‌త‌కు ఉద్యోగాలు కల్పించడానికి మేము సంయుక్తంగా ప‌ని చేస్తాం. అభివృద్ధి చెందిన రాష్ట్రాల‌ కేటగిరీకి బీహార్‌ను తీసుకురావడమే మా అంతిమ లక్ష్యం" అని నితీష్ కుమార్ అన్నారు.

నితీష్ ఎన్డీయే నుంచి విడిపోయాక‌.. బిజెపి నాయకులు ఎన్నిక‌ల స‌మ‌యంలో తేజస్వి యాదవ్ చేసిన‌ '10 లక్షల ఉద్యోగ వాగ్దానాన్ని' లేవనెత్తారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని మ‌హాఘ‌ట్‌బంధ‌న్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.

"సమాజంలో సోదరభావాన్ని కొనసాగించడంతోపాటు రాష్ట్రంలో న్యాయబద్ధమైన అభివృద్ధిని చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. మనకు అద్భుతమైన చరిత్ర, వారసత్వం ఉంది. గ‌త వైభ‌వాన్ని మళ్లీ సాధిస్తామని అన్నారు.

దీనిపై డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. బీహార్ ప్రజలకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ఇది సామాన్యుల అసలు సమస్య. మా యువకులు అదే కోరుకుంటున్నారు. మేము యువ‌త స‌మ‌స్య‌ల‌పై పని చేయడానికి, వారికి ఉపాధి కల్పించడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు.


Next Story