దక్షిణాఫ్రికా నుంచి వ‌చ్చిన ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌.. కొత్త వేరియంట్‌పై అనుమానం

2 South Africans In Bengaluru Positive For "Regular Covid", Quarantined. కోవిడ్-19 కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్ టెన్ష‌న్ పెడుతుంది. ఈ నేఫ‌థ్యంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్

By Medi Samrat  Published on  27 Nov 2021 3:23 PM GMT
దక్షిణాఫ్రికా నుంచి వ‌చ్చిన ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్‌.. కొత్త వేరియంట్‌పై అనుమానం

కోవిడ్-19 కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్ టెన్ష‌న్ పెడుతుంది. ఈ నేఫ‌థ్యంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల‌కు హెచ్చ‌రిక‌లు కూడా జారీ చేసింది. దీంతో అన్ని దేశాలు అల‌ర్ట్ అయ్యాయి. ఈ నేఫ‌థ్యంలోనే దక్షిణాఫ్రికా నుంచి భార‌త్‌కు వ‌చ్చిన‌ ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేల‌డంతో వారిని క్వారంటైన్‌లో ఉంచామ‌ని విమానాశ్ర‌య అధికారులు తెలిపారు. ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేఫ‌థ్యంలో వారి నమూనాలను తదుపరి పరీక్షల కోసం పంపినట్లు బెంగుళూరు రూర‌ల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ శ్రీనివాస‌న్‌ శనివారం తెలిపారు.

నవంబర్ 1 నుండి 26 వరకు.. మొత్తం 94 మంది దక్షిణాఫ్రికా నుండి వచ్చారు. వారిలో ఇద్దరికి కోవిడ్ -19 పాజిటివ్ నిర్థార‌ణ అయ్యిందని.. వారిద్దరినీ క్వారంటైన్‌లో ఉంచామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయ‌న‌ తెలిపారు. పది దేశాలను హై రిస్క్‌గా గుర్తించామని.. ఆ దేశాల‌ నుంచి వచ్చే వారందరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నామ‌ని.. పాజిటివ్‌గా తేలిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నామని అన్నారు. నవంబర్ 1 నుండి 26 వరకు ఆ పది హైరిస్క్ దేశాల నుండి 584 మంది బెంగళూరుకు చేరుకున్నారని ఆయన చెప్పారు.

బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో గత వారంలో కొత్త వేరియంట్‌ల కేసులు కనుగొనబడినట్లు గమనించిన నేఫ‌థ్యంలో.. ఆ దేశాల నుండి ప్రయాణించే వారి గురించి విమానాశ్రయాలకు మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయని తెలిపారు. కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉన్నప్పటికీ.. పరీక్షలు చేస్తున్నామ‌ని.. నెగెటివ్ వచ్చిన తర్వాత మాత్రమే ప్ర‌యాణికుల‌ను విమానాశ్రయం వెలుపలకు అనుమతిస్తున్నామ‌ని అన్నారు. రిపోర్టు నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా వారు ఇంట్లోనే ఉండవలసి ఉంటుంది. ఏడు రోజుల తర్వాత వారు మరోసారి పరీక్ష చేయించుకోవాలి. నెగిటివ్ రిపోర్టు వచ్చిన తర్వాత బ‌య‌ట‌కు వెళ్లాల‌ని తెలిపారు.


Next Story