దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూపీలోని మథురలో ఉన్న ప్రఖ్యాత బంకీ బిహారీ ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం భారీ సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మృతిచెందగా.. మరో ఏడు మంది గాయపడ్డారు. తెల్లవారుజామున 1.45 నిమిషాలకు మంగళ హారతి సమయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఊపిరి ఆడక ఇద్దరు భక్తులు మృతిచెంది ఉంటారని జిల్లా మెజిస్ట్రేట్ నవనీత్ సింగ్ చాహల్ తెలిపారు. తొక్కిసలాటలో నోయిడాకు చెందిన 55 ఏళ్ల మహిళతో పాటు జబల్‌పూర్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
ఇక ముంబైలో జరిగిన ఉట్టి వేడుకల్లో సుమారు 150 మంది గాయపడ్డారు. దహి హండి వేడుకల సమయంలో మానవ పిరమిడ్ నిర్మిస్తున్న సందర్భంలో గోవింద పాఠకులు గాయపడ్డారు. గాయపడ్డ 153 మందిలో.. 130 మందికి చికిత్స అందించామని, ఇంకా 23 మంది హాస్పిటల్‌లో ఉన్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. థానేలో కూడా 64 మంది గోవింద పాఠకులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో ఉట్టి కొట్టడాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే..! పలు బృందాలు ఈ ఉట్టి కొట్టడంలో పాల్గొంటూ ఉంటాయి.