అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండు పడవలు ఢీకొన్న ఘటనలో చాలా మంది ప్రయాణికులు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఘటన చోటుచేసుకున్నప్పుడు రెండు పడవల్లో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 20మందికి పైగా గల్లంతైనట్టు సమాచారం. ఇప్పటివరకు సహాయక బృందాలు 40 మందికి పైగా ప్రయాణికులను కాపాడాయి. ప్రభుత్వ బోట్ ప్రయాణికులతో మజూలీ అనే ప్రాంతం నుంచి నిమాతీ ఘాట్ వైపు వస్తుండగా.. మరో పడవ ఎదురుగా వచ్చి ఢీకొంది. ఇప్పటివరకు ఈ ఘటనలో ఎంతమంది మరణించిందీ అధికారులు వెల్లడించలేదు. అసోం రాజధాని గువాహటికి 350 కి.మీల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల సహకారంతో సహాయక చర్యలు చేపట్టాలని మజులి, జోర్హాత్ జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మంత్రి బిమల్ బోరాను తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఘటనా స్థలాన్ని గురువారం తాను సందర్శిస్తానని వెల్లడించారు. అక్కడి పరిణామాలను సీఎం ముఖ్యకార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా సమీక్షిస్తున్నారు. ఈ విషాదం తననెంతగానో బాధించిందని ట్వీట్ చేశారు.