పంజాబ్ సెక్టార్ లో ఎస్-400 క్షిపణి వ్యవస్థ

1st S-400 Squadron Deployed, To Tackle Pak, China Aerial Threats. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత వాయుసేన మొదటగా

By Medi Samrat  Published on  21 Dec 2021 9:30 PM IST
పంజాబ్ సెక్టార్ లో ఎస్-400 క్షిపణి వ్యవస్థ

రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత వాయుసేన మొదటగా పంజాబ్ సెక్టార్ లో మోహరించింది. దేశంలో తొలి ఎస్-400 స్క్వాడ్రన్ ఇదే. పాకిస్థాన్, చైనా నుంచి ఎదురయ్యే గగనతల సవాళ్లకు జవాబుగా దీన్ని కేంద్ర వర్గాలు భావిస్తూ ఉన్నాయి. 400 కిమీ పరిధిలో ఎదురయ్యే ముప్పును పసిగట్టి, శత్రు ఆయుధాలను ధ్వంసం చేయడం ఈ రష్యా తయారీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకత. ఇది ఏక కాలంలో పాక్, చైనాలపై దృష్టి సారించగలదు.

భారత్ కు ప్రస్తుతం ఎంతో అవసరమైన ఎస్‌-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ హైబ్రిడ్ రాడార్ ఆధారిత వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. శత్రువుల ఆయుధాలను, క్షిపణులను గుర్తించడం వాటిపై దాడి చేసే విధంగా ఎస్-400ని అభివృద్ధి చేశారు. గాల్లోకి పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు, క్షిపణులు దూసుకొస్తుంటే ఈ వ్యవస్థలోని మాస్టర్ రాడార్ గుర్తించి.. ఆ టార్గెట్ల సంఖ్య ఆధారంగా ఎన్ని మిస్సైళ్లు, ఏ రేంజ్ వి ప్రయోగించాలో మిస్సైల్ సిస్టమ్స్ కు ఎలక్ట్రానిక్ పద్థతిలో సంకేతాలు పంపుతుంది. అప్పుడు మన వైపు నుండి ప్రతి దాడి మొదలవుతుంది. బీ-1, బీ-2, ఎఫ్-15, ఎఫ్-35, ఎఫ్-16, ఎఫ్-22 వంటి బాంబర్లు, ఫైటర్ జెట్లు, టోమహాక్ వంటి క్రూయిజ్ మిస్సైళ్లు కూడా ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్ నుంచి తప్పించుకోలేవు. ఈ వ్యవస్థలో ప్రధానంగా నాలుగు రేంజ్ లు ఉంటాయి. 400 కిమీ, 250 కిమీ, 120 కిమీ, 40 రేంజిల్లో శత్రు కదలికలను గుర్తించి, అందుకు అనుగుణంగా ఏ మిస్సైల్ ను ప్రయోగించాలో రాడార్ నిర్ణయిస్తుంది. లక్ష్యాన్ని గుర్తించిన 9 నుంచి 10 సెకన్లలోనే ఇది స్పందిస్తుంది.

గగనతల రక్షణ వ్యవస్థను అత్యంత పటిష్ఠం చేసేందుకు భారత్ తన మిత్ర దేశం రష్యాతో రూ.35 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ లో ఐదు ఎస్-400 స్క్వాడ్రన్ల ఏర్పాటుకు అవసరమయ్యే ఆయుధ సంపత్తిని రష్యా సరఫరా చేస్తుంది. ఈ నెల ఆరంభంలో రష్యా నుంచి భారత్ కు ఎస్-400 విడిభాగాల సరఫరా మొదలైంది. పంజాబ్ లో ఏర్పాటు చేసిన తొలి యూనిట్ మరికొన్ని వారాల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది.


Next Story