హోలీకి ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రాష్ట్రంలోని 1.86 కోట్ల మంది అర్హులైన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ రీఫిల్ కోసం రూ.1890 కోట్ల సబ్సిడీని పంపిణీ చేశారు. లక్నోలోని లోక్‌భవన్ ఆడిటోరియంలో బటన్‌ను నొక్కి ఈ పథకాన్ని సీఎం యోగి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో గ్యాస్ కనెక్షన్ కోసం లంచం ఇవ్వాల్సి వచ్చేదని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఈ సదుపాయం ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. హోలీతో పాటు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఈసారి హోలీ, రంజాన్ పండుగలు కలిసి ఉన్నందున ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ ఉజ్వల పథకాన్ని 2016లో ప్రారంభించామని, దీని కింద దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు లభించాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 2 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. 2022లో ప్రభుత్వం ఏర్పడితే హోలీ, దీపావళి పండుగలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని 2021లో హామీ ఇచ్చామన్నారు. అప్పటి నుంచి ప్రజలు పండుగలను ఘనంగా జరుపుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం అమలు చేస్తున్నామన్నారు. ఈసారి హోలీ, రంజాన్ రెండూ కలిసి ఉంటాయి.. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారన్నారు.
గతంలో గ్యాస్ కనెక్షన్ కోసం రూ.25-30 వేలు లంచం ఇచ్చేవారని, పండుగల సమయంలో సిలిండర్లు కూడా లభించేవికావని పాత రోజులను సీఎం గుర్తు చేశారు. పేద తల్లులను పొగబారి నుంచి కాపాడేందుకే ఈ పథకాన్ని ప్రారంభించామని, ఇందులో ఎవరి పట్ల వివక్ష చూపడం లేదని ఉద్ఘాటించారు.