18 ఏనుగుల ప్రాణాలు తీసిన పిడుగు

18 elephants killed in lightning strikes in Nagaon district. ఒక్కోసారి మనం ఎవరైనా సరే ప్రకృతి ప్రకోపానికి బలి కాక తప్పదు. అసోంలో జరిగిన ఒక సంఘటన

By Medi Samrat  Published on  14 May 2021 7:15 PM IST
18 ఏనుగుల ప్రాణాలు తీసిన పిడుగు

ఒక్కోసారి మనం ఎవరైనా సరే ప్రకృతి ప్రకోపానికి బలి కాక తప్పదు. అసోంలో జరిగిన ఒక సంఘటన అలాంటి సాంకేతన్నే ఇచ్చింది. పిడుగులు పడి కనీసం 18 ఏనుగులు మృత్యువాత పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. నగోవ్ జిల్లా బుముని హిల్స్ వద్ద కొన్ని ఏనుగులు చనిపోయినట్టు స్థానికులు గుర్తించారు. ఒకేసారి 18 ఏనుగుల మృతి స్థానికులనే కాదు అధికారులను సైతం కలచివేసింది. మరణించిన ఏనుగులపై అక్కడి ప్రజలు పువ్వులు వేసి నివాళులు అర్పించారు. బుధవారం రాత్రి ఉరుములు, పిడుగులతో కురిసిన భారీ వర్షానికి ఇవి మృతిచెందినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందని అసోం అటవీ శాఖ అధికార వర్గాలు తెలిపారు. అయితే శుక్రవారం పోస్టుమార్టం తర్వాత మాత్రమే నిజమైన విషయం తెలుస్తుందని అటవీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చెప్పారు. వీటిలో

14 ఏనుగులు ఒక కొండపైన మరణించగా.. మరో నాలుగు ఏనుగులను కొండ దిగువ భాగంలో గుర్తించారు. ఈ సంఘటనలల్లో భారీగా ఇతర జంతువులు కూడా చనిపోయినట్లు సమాచారం. ఈ సంఘటన పై అస్సాం పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పరిమల్ సుక్లబైద్యా కూడా తన సంతాపం వ్యక్తం చేశారు.

నిజానికి ఆఫ్రికన్ దేశాలలో గడ్డి ఎక్కువగా ఉండే కొన్ని ప్రదేశాల బహిరంగ ప్రదేశాలలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కానీ భారతదేశంలో ఇలా గతంలో ఒక్కసారి మాత్రమే అది కూడా పశ్చిమ బెంగాల్‌లో 12-15 సంవత్సరాల క్రితం జరిగిందని కొందరు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. కాని అప్పుడు మరణాల సంఖ్య ఇంత ఎక్కువ కాదని వారు అన్నారు. 2017 లెక్కల ప్రకారం, కర్ణాటక తరువాత భారతదేశంలో అత్యధికంగా ఏనుగుల సంఖ్య అస్సాంలో ఉంది.


Next Story