వివిధ జైళ్లలో ఉన్న 166 మంది ఖైదీలను సత్ప్రవర్తన కనబరిచినందుకు జైలు నుండి విడుదల చేయనున్నారు. వారి జైలు శిక్షను తగ్గిస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. ముందస్తుగా విడుదలయ్యే ఖైదీల జాబితాను తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కసరత్తు జరుగుతుంది. అయితే, ఈ ఏడాది ఆలస్యమైందని మీడియాకు తెలిపింది ప్రభుత్వం. జీవిత ఖైదు 14 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసిన ఖైదీలను ముందస్తుగా విడుదల చేయడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. సీఆర్పీసీ యొక్క సెక్షన్ 435 కిందకు రాని, ష్యూరిటీ బాండ్లను అమలు చేసిన ఖైదీలు శిక్ష తగ్గింపుకు అర్హులు.
పెరోల్ సమయంలో వారు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. వారి ముందస్తు విడుదల ఫలితంగా శాంతిభద్రతలకు భంగం వాటిల్ల కూడదు, వారికి లేదా బాధిత కుటుంబానికి ముప్పు ఉండకూడదు. ఖైదీల శిక్షను తగ్గించే నిర్ణయాన్ని రాష్ట్ర హోం శాఖ కమిటీ సమీక్షించి, రాష్ట్ర మంత్రివర్గానికి సిఫార్సు చేస్తుంది. తుది ఆమోదం గవర్నర్‌చే ఇవ్వబడుతుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు మహిళలతో సహా 215 మంది జైలు ఖైదీల పేర్లను ఖరారు చేసింది. శిక్షలలో భాగంగా వారు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక ఇతర రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా 400 మంది ఖైదీలను విడుదల చేసింది.