మధ్యప్రదేశ్‌లో క్వారీ తవ్వుతుండగా బయటపడ్డ కుండ.. 164 పురాతన నాణేలు లభ్యం.. ఇంకా..
164 rare coins found in Madhya Pradesh. మధ్యప్రదేశ్‌లోని తికమ్‌ఘర్ జిల్లాలో ఓ రాతి క్వారీని తవ్వుతుండగా 164 పురాతన నాణేలు బయటపడ్డాయి.
By అంజి Published on 2 Dec 2021 7:52 AM GMTమధ్యప్రదేశ్‌లోని తికమ్‌ఘర్ జిల్లాలో ఓ రాతి క్వారీని తవ్వుతుండగా 164 పురాతన నాణేలు బయటపడ్డాయి. ఈ నాణేలు బహుశా మొఘల్ కాలం నాటివి అని, అవి ఒక కుండలో భద్రపరచబడినట్లు ఒక అధికారి తెలిపారు. రాళ్ల తవ్వకాలు చేస్తుండగా ఓ కుండ బయట పడిందని, దానిలో పురాతన నాణేలు లభించాయని అధికారి తెలిపారు. రాళ్ల తవ్వకంలో నిమగ్నమైన ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ నాణేల గురించి తమకు తెలియజేశారని జిల్లా మైనింగ్ అధికారి ప్రశాంత్ తివారీ చెప్పారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందనవారా గ్రామంలోని సంఘటనా స్థలానికి వెళ్లినట్లు మీడియాకు వివరించారు.
"ఒక మట్టి కుండలో మొత్తం 164 నాణేలు, అందులో 12 వెండి, మిగిలినవి రాగి నాణేలు, వాటిపై ఉర్దూ లేదా పర్షియన్ భాషల్లో చెక్కబడి ఉన్నాయి. జిల్లా ఖజానాలో ఆ నాణేలు జమ చేశాం'' అని తెలిపారు. పురావస్తు శాఖకు చెందిన బృందం నాణేలను విశ్లేషిస్తుందన్నారు. నాణేలు ఏ కాలానికి చెందినవి, వాటిపై వ్రాయబడిన భాష అధ్యయనం తర్వాత తెలుస్తాయని ఆయన అన్నారు. ముఖ్యంగా నివారి జిల్లాలోని ఓర్చా, రామ్ రాజా ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది నందనవారా గ్రామానికి 45 కి.మీ దూరంలో ఉంది. నివారి జిల్లా 2018లో తికమ్‌ఘర్ నుండి వేరు చేయబడింది.
బుందేల్‌ఖండ్‌లోని ఈ ప్రాంతంను ఆఫ్ఘన్‌లు, మొఘల్ పాలించారు. చరిత్ర ప్రకారం, జుజార్ సింగ్ 1626లో ఓర్చా రాజు అయ్యాడు. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి సామంతుడిగా ఉండనని ప్రతిజ్ఞ చేశాడు. పాలిస్తున్న మొఘల్ చక్రవర్తి షాజహాన్ నుండి స్వాతంత్ర్యం పొందేందుకు అతని ప్రయత్నం అతని పతనానికి మార్గం సుగమం చేసింది. అప్పుడు ఔరంగజేబు నేతృత్వంలోని మొఘల్ సైన్యం అతని భూమిపై దాడి చేసి 1635లో దానిని స్వాధీనం చేసుకుంది, సింగ్ చౌరాఘర్‌కు తిరోగమనం చేయవలసి వచ్చింది.