ఏకనాథ్ షిండే క్యాంపులోని ఎమ్మెల్యేల కార్యాలయాలు, ఆస్తులను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారన్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఆదివారం 15 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. అయితే.. ఆ ఎమ్మెల్యేల జాబితాలో తిరుగుబాటు ముఖ్యనేత ఏక్‌నాథ్ షిండే లేకపోవడం గమనార్హం. 'వై' కేటగిరీ భద్రతలో ఎనిమిది మంది సిబ్బంది సెక్యూరిటీగా ఉంటారు. వారిలో ఒకరు లేదా ఇద్దరు కమాండోలు.. మిగతావారు పోలీసు సిబ్బంది ఉండవచ్చు.
దాదర్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్ గౌహతిలోని ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేల క్యాంపులో చేరిన నేపథ్యంలో.. ఆయన నివాసం వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మోహరించింది. మరోవైపు థానే, డోంబివిలి, కళ్యాణ్, ఉల్హాస్‌నగర్‌లోని షిండే క్యాంపు కార్యాలయాలకు పోలీసు భద్రత కల్పించారు.
ఈ వారం ప్రారంభంలో ఉద్ధవ్ ఠాక్రే ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి హాజరుకానందుకు మంత్రి ఏక్‌నాథ్ షిండేతో సహా 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు శనివారం అనర్హత నోటీసులు అందాయి. అయితే, షిండే నేతృత్వంలోని తిరుగుబాటు శిబిరం ఆ సమన్లకు సమాధానం ఇవ్వడానికి ఏడు రోజుల సమయం కోరింది.
Y+ భద్రతను.. రమేష్ బోర్నారే, మంగేష్ కుడాల్కర్, సంజయ్ శిర్సత్, లతాబాయి సోనావానే, ప్రకాస్ సర్వే, సదానంద్ శరణవంకర్, యోగేష్ దాదా కదమ్, ప్రతాప్ సర్నాయక్, యామినీ జాదవ్, ప్రదీప్ జైస్వాల్, సంజయ్ రాథోడ్, దాదాజీ భూసే, దిలీప్ లాండే, బాలాజీ కళ్యాణర్, సందీపన్ భూమారే లకు కేటాయించారు.