సముద్రం అల్లకల్లోలం.. 8 మంది మత్స్యకారుల గల్లంతు.. రంగంలోకి నేవీ
15 Fishing Boats Capsize In Gir Somnath.. 8 Fishermen Feared Missing. గుజరాత్ తీర సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం బలమైన గాలుల కారణంగా కనీసం 15 మత్స్యకార పడవలు గిర్ సోమనాథ్
By అంజి Published on 2 Dec 2021 9:43 AM GMTగుజరాత్ తీర సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం బలమైన గాలుల కారణంగా కనీసం 15 మత్స్యకార పడవలు గిర్ సోమనాథ్ నవ బందర్ పోర్టు సమీపంలోని సముద్రంలో బోల్తా పడ్డాయి. బోటులో ఉన్న 15 మంది మత్స్యకారులలో నలుగురిని రక్షించగా, 11 మంది మత్స్యకారులు గల్లంతైనట్లు భావిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత ఎయిర్‌ఫోర్స్ హెలికాఫ్టర్ సహాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని మూడు రోజుల పాటు హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబర్ 1, 2 తేదీలలో గుజరాత్, ఉత్తర కొంకణ్‌లో భారీ, విస్తారమైన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
తప్పిపోయిన 8 మంది మత్స్యకారుల ఆచూకీ కోసం గురువారం తెల్లవారుజామున కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఉనా తాలూకాలోని మమ్లత్దార్ (రెవెన్యూ అధికారి) ఆర్ ఆర్ ఖంబ్రా తెలిపారు. ఈదురుగాలుల కారణంగా తీరంలో లంగరు వేసిన 40 బోట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 40 పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు.
"నవబందర్ గ్రామంలో అర్ధరాత్రి తర్వాత బలమైన గాలులు, సముద్రపు అలల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. మొదట్లో 12 మంది మత్స్యకారుల జాడ తెలియలేదు, అయితే వారిలో నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఎనిమిది మంది తప్పిపోయారు. కోస్ట్ గార్డ్ పంపిన హెలికాప్టర్ సహాయంతో మేము రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాము." అని ఖంబ్రా చెప్పారు.
నవబందర్ సర్పంచ్ (గ్రామపెద్ద) సోమవర్ మజిథియా తెలిపిన వివరాల ప్రకారం.. వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు రావడంతో అర్ధరాత్రి సమయంలో బలమైన గాలులు, అలలు తీరాన్ని తాకినప్పుడు మత్స్యకారులు తమ లంగరు వేసిన పడవలలో నిద్రిస్తున్నారని తెలిపారు.
గత వారం, గుజరాత్‌లోని గల్ఫ్ ఆఫ్ కచ్‌లో MVs ఏవియేటర్, అట్లాంటిక్ గ్రేస్ అనే రెండు కార్గో షిప్‌లు ఢీ కొనడం వల్ల అరేబియా సముద్రంలో చమురు పొర ఏర్పడింది. నవంబర్ 26న గుజరాత్ తీరంలో రెండు బల్క్ కార్గో షిప్‌లు ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.