జికా వైరస్‌ కలకలం.. ఒక్క రోజే 14 కేసులు..!

14 zika virus cases found in uttar pradesh. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్ కలకలం రేపుతోంది. అక్కడ బుధవారం ఒక్క రోజే 14 కొత్త జికా వైరస్ కేసులు

By అంజి  Published on  3 Nov 2021 5:14 PM IST
జికా వైరస్‌ కలకలం.. ఒక్క రోజే 14 కేసులు..!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్ కలకలం రేపుతోంది. అక్కడ బుధవారం ఒక్క రోజే 14 కొత్త జికా వైరస్ కేసులు వెలుగు చూశాయి. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. జికా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌తో సమావేశం జరిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఓ గర్భిణికి కూడా వైరస్‌ సొకినట్లు తెలుస్తోంది. కాన్పూర్‌లో గతంలో 11 జికా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో ఈ సంఖ్య 25కి చేరింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా అధికారం యంత్రాగం కృషి చేస్తోంది. ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి జికా వైరస్‌ లక్షణాలు ఉన్నావారిని గుర్తిస్తున్నారని అధికారులు చెప్పారు. 150 బృందాలతో శానిటేషన్‌ చేయిస్తున్నామని తెలిపారు.

జికా వైరస్‌ను మొదటిసారిగా 1947లో ఉగాండా ఫారెస్‌లో ఉండే రీసస్‌ కోతిలో గుర్తించారు. ఈ వ్యాధికి వ్యాప్తికి ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ అనే దోమలు వాహకాలుగా పని చేస్తాయి. జికా వైరస్‌ వ్యాధి 1954లో నైజీరియా దేశంలో బయటపడగా.. అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలు, భారత్‌, మలేషియా, థాయిలాండ్‌, వియత్నాం, ఇండోనేషియా దేశాల్లో వ్యాధి వ్యాపించింది. 2016 ఫిబ్రవరి 39 దేశాల్లో జికా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రజా ఆరోగ్య ఆత్యయిక స్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇది లైంగికంగా కూడా సక్రమించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. వైరస్‌ సోకడం ద్వారా మనిషికి కీళ్లనొప్పులు, తలనొప్పి, జ్వరం, చర్మంపై దద్దుర్లు, గొంతునొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనబడతాయి. ప్రస్తుతానికి జికా వైరస్‌ సోకిన వారికి ఎలాంటి చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. దోమలు కుట్టకుండా చూసుకోవడం చాలా అవసరం.

Next Story