14 రాష్ట్రాల్లో లాక్ డౌన్.. ఇక్కడ అండర్ కంట్రోల్ అని చెప్తున్నారే..!

14 States Imposed Lockdown. భారతదేశంలో ప్రతి రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతూ ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  8 May 2021 11:05 AM GMT
14 రాష్ట్రాల్లో లాక్ డౌన్.. ఇక్కడ అండర్ కంట్రోల్ అని చెప్తున్నారే..!

భారతదేశంలో ప్రతి రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతూ ఉన్న సంగతి తెలిసిందే..! కొత్త‌గా 4,01,078 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,18,609 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 4,187 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,38,270కు పెరిగింది. లాక్ డౌన్ విధిస్తే తప్పితే భారత్ లో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదవ్వదని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. లాక్ డౌన్ అంశం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉండనుందని భారత ప్రధాని గతంలోనే చెప్పేయడంతో చాలా మంది ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను త్వరలోనే విధించబోతూ ఉన్నారు.

ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నారు. యూపీ, ఢిల్లీ లో మే 10 వరకు లాక్ డౌన్ అమలులో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మే 15 వరకు లాక్ డౌన్. మహారాష్ట్రలో లాక్ డౌన్ అమలు చేయడంతో కరోనా కేసులు కట్టడి అయిన సంగతి తెలిసిందే..! ఈరోజు నుంచి మే 16 వరకు కేరళలో లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ లో మే 16 వరకు లాక్ డౌన్ గా ప్రకటించేశారు. తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో మే 10 నుంచి 24 వరకు లాక్ డౌన్ ను విధించనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పూర్తీ లాక్ డౌన్ ఊసే లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 6-12 వరకూ మాత్రమే షాపులు తీసుకోడానికి అనుమతి ఇవ్వగా.. మిగతా సమయాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది. ఇక తెలంగాణలో లాక్ డౌన్ గురించి ఆలోచించడం లేదని అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే. భారీగా పెరిగిపోతూ ఉన్న కరోనా కేసుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ విధిస్తే మంచిదని నిపుణులు చెబుతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తీ లాక్ డౌన్ పై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Next Story