న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ప్రయత్నించిన 14 మంది రోహింగ్యాలను.. అగర్తలా-న్యూఢిల్లీ స్పెషల్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అరెస్టు చేసినట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రతినిధి తెలిపారు. ముందుగా రైల్వేస్ సెక్యూరిటీ హెల్ప్‌లైన్ 182కు వచ్చిన సమాచారంతోనే వారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అలీపూర్దుర్ సెక్యూరిటీ కంట్రోల్‌కు నవంబర్ 24న ఓ ప్రయాణికుడు సమాచారం అందించాడని.. ఆర్‌పీఎఫ్ అధికారులు కటిహార్ డివిజన్ పరిధిలోని న్యూ జల్పాయిగురి వద్ద తమ సహచరులకు ఈ విషయాన్ని చేరవేశారని.. దీంతో ఆ బృందం వచ్చి రోహింగ్యాలను ప్రశ్నించారని అన్నారు.
వారంతా నకిలీ పేర్లతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ వద్ద ఉన్న శరణార్థి శిబిరం నుంచి పారిపోయి దేశంలోకి చొరబడినట్లు పేర్కొన్నారు. వారందరిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచి.. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆ 14 మంది రోహింగ్యాలపై విదేశీయుల (సవరణ)చట్టం కింద కేసు నమోదైంది.