ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ముందు రాజకీయం వెడెక్కింది. మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మంగళవారం కార్మిక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మంత్రి పదవికి, బిజెపికి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆయన వెంటే మరో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఇది పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అంశం. ఈ షాక్ నుండి అధికార బీజేపీ తేరుకోక ముందే.. మరో పదమూడు మంది శాసనసభ సభ్యులు సమాజ్‌వాదీ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సంచలనానికి తెరలేపారు.
'ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఇతర చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం' అని శరద్ పవార్ చెప్పినట్లు ANI వార్తా సంస్థ పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని.. రాష్ట్రంలో మార్పును తప్పకుండా చూస్తామని.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో మత ధృవీకరణ జరుగుతోందని, దీనికి యూపీ ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆయన అన్నారు. ముంబైలో శరద్ పవార్ మాట్లాడుతూ.. రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, టీఎంసీతో పొత్తు పెట్టుకోవడానికి తమ పార్టీ చర్చలు జరుపుతోందని చెప్పారు.