రాజస్థాన్‌లోని బుండీ జిల్లాలో 13 నెమళ్లు మృతి చెందడం కలకలం రేపింది. ఇంత పెద్ద సంఖ్యలో నెమళ్లు చనిపోడానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నారు. వాటికి విషపు గింజలు ఇచ్చి చంపేశారని ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన నెమళ్లు మాత్రమే కాకుండా వాటి సమీపంలో అపస్మారక స్థితిలో మరో రెండు నెమళ్లు కనిపించాయి. ఇంత పెద్ద సంఖ్యలో జాతీయ పక్షి నెమళ్లు మృతి చెందడంతో బుండీ జిల్లా యంత్రాంగంలో కలకలం రేగింది. బుండీలోని తలెడా ప్రాంతంలోని బజాద్ నుండి సువాసా గ్రామం మధ్య కలిఖత్ కాలువ ప్రాంతంలో చోటు చేసుకుంది. నెమళ్లు మృతి చెందడానికి కారణం వేటగాళ్ళే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అటవీశాఖ సిబ్బంది, వెటర్నరీ డాక్టర్, బజాద్ సర్పంచ్ నాథూలాల్ బైర్వా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నెమలి కళేబరాలు ఉన్న చోట మొక్కజొన్న, గోధుమ ధాన్యాలు చెల్లాచెదురుగా పడ్డాయి. వేటగాళ్లు వాటిలో విషపూరిత పదార్థాలను కలిపి అక్కడ పారేసినట్లు తెలుస్తోంది. ఈ గింజలను నెమళ్లు తిని ప్రాణాలు కోల్పోయాయి. నెమళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాలేరా వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న రెండు నెమళ్లకు వైద్యం అందిస్తున్నారు. నెమళ్లకు విషపూరిత పదార్థాలు ఇచ్చి చంపిన వేటగాళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వన్యప్రాణుల ప్రేమికులు కోరుతున్నారు.