కేరళ రాష్ట్రం లోని పలు జిల్లాలు భారీ వర్షాల కారణంగా ధ్వంసమయ్యాయి. మంగళవారం ఉదయం కేరళలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో 106 మంది మరణించారు, 128 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. ఇంకా కొండచరియల కింద వందలాది మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలో వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఎన్‌డిఆర్‌ఎఫ్‌తో సహా పలు ఏజెన్సీలు, సైన్యం సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి.
ముండక్కై, చూరల్‌మల, అత్తమాల, నూల్‌పుజా గ్రామాలలో కొండచరియలు విరిగిపడడంతో ప్రజలు తీవ్రంగా గాయాలపాలయ్యారు. చాలా మంది చలియార్ నదిలో కొట్టుకుపోయారని స్థానికులు చెబుతున్నారు. వైద్య బృందాలతో సహా 225 మంది సిబ్బందిని మోహరించినట్లు భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు వైమానిక దళ హెలికాప్టర్లు, ఒక Mi-17, ఒక ALH (అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్) ప్రజల కోసం అందుబాటులో ఉంచామని తెలిపింది ఆర్మీ.