బిపర్‌జాయ్ బీభ‌త్సం.. వెయ్యి గ్రామాలకు నో పవర్

1,000 villages in Gujarat without power, aftermath of Cyclone Biparjoy. గుజరాత్‌లోని కచ్-సౌరాష్ట్ర ప్రాంతంపై బిపర్‌జాయ్ తీవ్ర ప్రభావాన్ని చూపించింది.

By Medi Samrat  Published on  16 Jun 2023 8:23 PM IST
బిపర్‌జాయ్ బీభ‌త్సం.. వెయ్యి గ్రామాలకు నో పవర్

గుజరాత్‌లోని కచ్-సౌరాష్ట్ర ప్రాంతంపై బిపర్‌జాయ్ తీవ్ర ప్రభావాన్ని చూపించింది. భారీ గాలుల ధాటికి 5,120 విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యాయి. అయితే ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. మొదట 4,600 గ్రామాలకు విద్యుత్తు లేకుండా పోయింది. గాంధీనగర్‌లోని రిలీఫ్ కమీషనర్ అలోక్ కుమార్ పాండే మాట్లాడుతూ, "తుఫాను కారణంగా రాష్ట్ర విద్యుత్ సంస్థ, పశ్చిమ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్ కు చెందిన 5,120 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరిస్తున్నారు. 4,600 గ్రామాలకు విద్యుత్ సరఫరా లేకుండా పోయిందని.. ఇప్పటికి 3,580 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు. మిగిలిన గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అయితే ప్రతికూల వాతావరణం కారణంగా పనులకు ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పారు.1,000 గ్రామాలకు పైగా ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదని విద్యుత్ శాఖ తెలిపింది.

దాదాపు 600 చెట్లు నేలకూలాయి.. మూడు రాష్ట్ర రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర సహాయ మరియు పునరావాస శాఖ ప్రకారం పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. తుఫాను కారణంగా 23 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాలుల వేగం గంటకు 140 కి.మీ గా నమోదైంది. పలు ప్రాంతాళ్లి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని.. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లోకి సముద్రపు నీరు చేరిందని అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 6.30 గంటల నుండి జఖౌ పోర్ట్ సమీపంలో తుఫాను తీరాన్ని తాకడం ప్రారంభించినప్పటి నుండి కచ్ జిల్లా మొత్తం భారీ వర్షాలు కురిశాయని, ఈ విధ్వంసం తెల్లవారుజామున 2.30 గంటల వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు.

పునరావాసం

"బిపర్‌జాయ్ తుఫాను కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణం నివేదించబడలేదని తెలిపారు. ఇది రాష్ట్రానికి అతిపెద్ద విజయమని.. సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమైంది" అని గుజరాత్ రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ అలోక్ కుమార్ పాండే గాంధీనగర్‌లో విలేకరులతో అన్నారు. తుపాను తీరం దాటకముందే లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. భావ్‌నగర్ జిల్లాలో మేకలను రక్షించే ప్రయత్నంలో గురువారం తండ్రీ కొడుకులు చనిపోయారు. దీని గురించి అడిగిన ప్రశ్నకు పాండే సమాధానం చెబుతూ ఆ జిల్లాపై తుఫాను ప్రభావం లేదని అన్నారు.

వివిధ జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్నారు కేంద్ర, రాష్ట్ర మంత్రులు. పరిపాలన, సామాజిక సేవా సంస్థల సమన్వయంతో రెస్క్యూ, రిలీఫ్‌ ఆపరేషన్‌లు జరిగేలా చూశారు. సమిష్టి కృషి వల్ల అరేబియా సముద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకుని వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. పరిస్థితి మెరుగుపడగానే స్థానిక జిల్లా యంత్రాంగం ప్రజలను తిరిగి వారి స్వస్థలాలకు తరలించనున్నారు.

ఒక్క ప్రాణం కూడా పోలేదు

తుపాను ధాటికి ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని ఢిల్లీలోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. అధికారులు, ఇతర ఏజెన్సీల ప్రయత్నాల వల్ల ప్రాణ ప్రాణ నష్టం జరగలేదని.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికి అందరూ కృషి చేశారని ఆయన అన్నారు. రాజ్‌కోట్ మినహా, గుజరాత్‌లో ఎక్కడా భారీ వర్షాలు లేవని తెలిపారు.

18 NDRF బృందాలు గుజరాత్‌లో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను చేపట్టడానికి మోహరించారు. తుఫాను దక్షిణ రాజస్థాన్ వైపు వెళుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత NDRF జలోర్‌లో ఒక బృందాన్ని ఉంచింది. తుఫాను తీవ్రత కాస్త తగ్గింది. దక్షిణ రాజస్థాన్‌లో అల్పపీడనంగా మారుతుందని అధికారులు తెలిపారు.


Next Story