పదేళ్ల వైవాహిక యుద్ధానికి ఒకే దెబ్బతో ముగింపు..!
సుప్రీంకోర్టు ఒకే తీర్పులో 61 కేసులను పరిష్కరించింది. భార్యాభర్తల మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న వైవాహిక వివాదం ఎంతగా సంక్లిష్టమైందంటే..
By - Medi Samrat |
సుప్రీంకోర్టు ఒకే తీర్పులో 61 కేసులను పరిష్కరించింది. భార్యాభర్తల మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న వైవాహిక వివాదం ఎంతగా సంక్లిష్టమైందంటే.. అది దేశవ్యాప్తంగా 61కి పైగా కేసులకు దారితీసింది. జస్టిస్‌లు బి.వి. నాగారత్న, ఉజ్జ్వల్ భూయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. భార్యాభర్తల మధ్య ఉన్న ఈ వ్యాజ్యాన్ని ముగించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ప్రయోగించింది.
వారి వివాహానికి సంబంధించిన అన్ని వివాదాలను పరిష్కరించేందుకు ఇరు పక్షాలు స్వచ్ఛందంగా ఒక రాజీ ఒప్పందానికి వచ్చారని కూడా ధర్మాసనం నిర్ధారించింది. సుప్రీంకోర్టుకు చేరిన అత్యంత వివాదాస్పద వైవాహిక కేసులలో ఒకదానికి ముగింపు పలుకుతూ.. న్యాయస్థానం ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ జంట 1994లో వివాహం చేసుకుని, గత దశాబ్ద కాలంగా విడివిడిగా నివసిస్తున్నారు.
ఒప్పందం ప్రకారం.. భర్త తన భార్యకు ₹1 కోటి శాశ్వత భరణం చెల్లించాలి. అతను లోనావాలాలోని తన ఆస్తి వాటాను రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా ఆమెకు బదిలీ చేయాలి. ఒప్పందంలోని ఆర్థిక నిబంధనలను నెరవేర్చడానికి, కోర్టు రిజిస్ట్రీలో జమ చేసిన ₹90 లక్షలను పిటిషనర్‌కు విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.
ఈ ఒప్పందంలో పక్షాల మధ్య ఉన్న అన్ని వివాదాలకు పూర్తి పరిష్కారం లభించేలా సుప్రీం కోర్టు కూడా నిర్ధారించింది. వైవాహిక సంబంధం నుండి ఉత్పన్నమయ్యే గత, ప్రస్తుత, భవిష్యత్ క్లెయిమ్‌లన్నీ రద్దయినట్లుగా పరిగణించబడతాయని, ఏ పక్షం కూడా మరొక పక్షంపై ఎటువంటి తదుపరి సివిల్ లేదా క్రిమినల్ చర్యలను ప్రారంభించదని అభిప్రాయ వ్యక్తం చేసింది.
దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు.. ఒక అడుగు ముందుకు వేసి, ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, స్వయంగా సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ ఫిర్యాదులు, గృహ హింస విచారణలు, రిట్ పిటిషన్లు, ధిక్కార పిటిషన్లు, అప్పీళ్లతో సహా పార్టీల మధ్య పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను కొట్టివేసింది.
ఈ కేసులను ముగిసినట్లుగా పరిగణించడమే కాకుండా, అదే విషయానికి సంబంధించిన భవిష్యత్ ఫిర్యాదులను కూడా స్వీకరించబోమని కోర్టు స్పష్టం చేసింది. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు తదుపరి వ్యాజ్యాలను కొనసాగించకుండా నిరోధించబడ్డాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142.. "సంపూర్ణ న్యాయం" చేసే ఉద్దేశ్యంతో అవసరమైన ఏ ఉత్తర్వునైనా జారీ చేయడానికి సుప్రీం కోర్టుకు అధికారం కల్పిస్తుంది. సాంకేతిక అడ్డంకులను తొలగించడానికి, పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను ఒకేసారి పరిష్కరించడానికి ఈ ఉత్తర్వును ఉపయోగిస్తారు.