జులై 26న, బీహార్‌లోని కతిహార్‌లోని బార్సోయ్‌లో గ్రామస్తులు విద్యుత్ శాఖ కార్యాలయం ముందు నిరసనలు తెలియజేస్తూ ఉండగా.. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని, విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. పోలీసు కాల్పుల్లో కనీసం ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసుల కాల్పుల్లో మరణించిన వ్యక్తిని మహ్మద్ ఖుర్షీద్ (35)గా గుర్తించారు. గాయపడిన వారిలో ఒకరు కతిహార్‌లోని సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన రెండో వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి రిఫర్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ సమయంలో కొంతమంది రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం మధ్యాహ్నం గం.3 సమయానికి విద్యుత్ శాఖ తీరుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలిపారు. ఈ ప్రదర్శన సందర్భంగా కొంతమంది విద్యుత్ శాఖ కార్యాలయంపై దాడి చేశారని తెలుస్తోంది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.