సీఎం జగన్‌కు నాగబాబు అభినందనలు.. రిక్వెస్టుపై ఏమంటారో.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 May 2020 10:54 AM IST
సీఎం జగన్‌కు నాగబాబు అభినందనలు.. రిక్వెస్టుపై ఏమంటారో.?

తన ట్వీట్లతో తరచూ వార్తల్లోకి వస్తున్న జనసేన అధినేత పవన్ సోదరుడు కమ్ నటుడు నాగబాబు. తాజాగా ఆయన చేసిన ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన టీటీడీ భూముల అమ్మకాల విషయంలో ఏపీ సర్కారు వెనకడుగు వేయటం తెలిసిందే. టీటీడీ భూముల్ని అమ్మాలనుకున్న బోర్డు నిర్ణయాన్ని సర్కారు పక్కన పెట్టేసింది. దీంతో.. మొన్నటివరకూ ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలన్న పలువురు.. ఇప్పుడు ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

టీటీడీ భూముల అమ్మకాల విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ట్విట్టర్ సాక్షిగా అభినందనలు తెలిపారు నాగబాబు. అదే సమయంలో శ్రీవారి బొక్కసంలో ఉండాల్సిన పింక్ డైమండ్ గురించి ఇప్పటికే పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. ఆ అంశంపైనా విచారణ జరిపి నిజాల్ని నిగ్గు తేల్చాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. మరి.. నాగబాబు చేసిన రిక్వెస్టుకు సీఎం జగన్ స్పందన ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే.. మరో రెండు ట్వీట్లలో న్యాయస్థానాలపై వ్యాఖ్యలు చేస్తున్న వారి వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు నాగబాబు. న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసే వ్యాఖ్యలు చాలా పెద్ద మిస్టేక్ అని అభివర్ణించిన నాగబాబు.. ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉందంటే.. అది కేవలం న్యాయవ్యవస్థ సమర్థంగా పని చేయటమే కారణంగా పేర్కొన్నారు. ఎప్పటిలానే నాగబాబు వ్యాఖ్యలు ఆసక్తితో పాటు.. హాట్ టాపిక్ గా మారాయి.





ఇంతకీ నాగబాబు చేసిన ట్వీట్ ఏమిటన్నది చూస్తే.. ‘‘మన దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉందంటే అది కేవలం న్యాయవ్యవస్థ సమర్థంగా పని చేయటమే. న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసే వ్యాఖ్యలు చేయటం చాలా పెద్ద తప్పు. న్యాయవ్యవస్థలో మనకి న్యాయం జరగకపోతే.. పైకోర్టుకు వెళ్లటానికి అవసరం ఉంది కదా. అలాంటప్పుడు కోర్టునిర్ణయాల్ని తప్పు పట్టే కామెంట్స్.. న్యాయ వ్యవస్థ మీద వెటకారం చేసే టీవీ డిబేట్స్.. న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కామెంట్స్ చేసే వారిపై తగిన విధంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా. న్యాయవ్యవస్థ ఎప్పటికి నిర్వీర్యం కాకూడదు’’ అంటూ భారీ ట్వీట్లలో తన అభిప్రాయాన్ని సూటిగా.. స్పష్టంగా వెల్లడించారు. తనకు అభినందనలు తెలుపుతూ పింక్ డైమండ్ వ్యవహారాన్ని చూడాలన్న నాగబాబు రిక్వెస్టును సీఎం జగన్ ఏం చేస్తారో చూడాలి.



Next Story