సమస్య పరిష్కరించకపోతే.. ఇదే నాలలో దూకి చచ్చిపోతా : ఎమ్మెల్యే
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Sept 2020 7:37 PM ISTమేడ్చల్ జిల్లా నేరెడ్‌మేట్ నాలాలో గల్లంతైన సుమేధ అనే బాలిక శవమై బండచెరువులో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే.. జరిగిన ఘటనకు జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలిక అదృశ్యంపై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు.
నిన్న రాత్రి ఏడు గంటలకు ఫోన్ చేస్తే ఉదయం వచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అధికారులు సమయానికి స్పందించి ఉంటే ఇంత ఘోర జరిగేది కాదని కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే.. నేరెడ్‌మెట్ లో బాలిక మరణంతో మల్కాజిగిరిలో ఓపెన్ నాలాల సమస్యపై ఎమ్మెల్యే మైనంపల్లిని స్థానికులు ప్రశ్నించారు.
దీంతో.. మైనంపల్లి మల్కాజిగిరిలో ఓపెన్ నాలాల సమస్య లేకుండా చేస్తానని.. వచ్చే ఏడాదిలో లోగా నాల సమస్య పరిష్కరించకపోతే ఇదే నాలలో దూకి చచ్చిపోతానని శపథం చేస్తూ.. స్థానిక మహిళ కాళ్ళు పట్టుకున్నారు. ఎమ్మెల్యే మహిళ కాళ్లు పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదైనా ఘోరం జరిగితే తప్ప నేతలకు ఓట్లు వేసిన ప్రజలు గుర్తుకురారా..? అని నేతల తీరుపై నెటిజన్లు ఫైరవుతున్నారు.