ధోని అలా కనిపించాడు.. అభిమానులు ఆనందించారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2020 6:22 AM GMT
ధోని అలా కనిపించాడు.. అభిమానులు ఆనందించారు

ఎం.ఎస్.ధోని ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు ధోని. ఆయనకు సంబంధించిన సమాచారం చాలా వరకూ ఆయన భార్య సాక్షి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటారు. ధోని తన కుమార్తెతో గడుపుతున్న వీడియో, బైక్ మీద చక్కర్లు కొడుతున్న వీడియోలు, లాక్ డౌన్ సమయంలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ధోని అంటూ పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఎంతో మందికి అభిమాన క్రికెటర్ అయిన ధోనిని గ్రౌండ్ లో చూసి చాలా సమయమే అయింది. దీంతో అభిమానులు కూడా ధోనిని తిరిగి గ్రౌండ్ లో ఎప్పుడు చూస్తామా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకూ ఇలా వీడియోలలో చూసుకోవాల్సిందే..!

తాజాగా ధోనికి సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ధోని అభిమానులే కాకుండా.. ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా తమ సామాజిక మాధ్యమాల్లో ధోని వీడియోను పోస్టు చేసింది. "The much needed pawsitivity at 7! #Thala @msdhoni #WhistlePodu," సిఎస్కే జట్టు వీడియోను పోస్టు చేసింది.

ఈ వీడియోలో ధోని పూర్తిగా కొత్త లుక్ తో కనిపించాడు. బనియన్ మీద ఉన్న ధోని నవ్వుతూ కనిపించాడు.. హెయిర్ స్టైల్ మొత్తం మార్చివేసి కనిపించాడు ధోని. వీడియో కాల్ లో ధోని మాట్లాడుతున్నట్లుతెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ వీడియోను పోస్టు చేయగానే ఇన్స్టంట్ హిట్ గా మారిపోయింది వీడియో. అభిమానులు విపరీతమైన షేర్లు చేయడం మొదలుపెట్టారు.. అలాగే తమకు నచ్చిన కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ధోని త్వరగా గ్రౌండ్ లో అడుగుపెట్టాలని ఫోర్లు, సిక్సర్లతో అలరించాలని కోరుతున్నారు.

గత ఏడాది వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో భారతజట్టు ఓటమి చెందిన తర్వాత ధోని ఎటువంటి ఫార్మాట్ లోనూ క్రికెట్ ఆడలేదు. ఈ ఏడాది ఐపీఎల్ లో ధోనిని చూడవచ్చు అని అభిమానులు భావించారు. లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో అభిమానులు ఎంతో నిరాశ చెందారు. ఈ మధ్య కాలంలో ధోని రిటైర్మెంట్ ప్రకటించారంటూ పలువురు పోస్టులు పెట్టడం.. అవి వైరల్ కావడం.. ఆ వార్తల్లో నిజం లేదంటూ ధోని సన్నిహితులు తెలపడం జరుగుతూనే ఉన్నాయి.

ఏప్రిల్-మే నెలల్లో ఐపీఎల్ కోసం సమయాన్ని కేటాయించేది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ఈ ఏడాది ఆ సమయంలో ఐపీఎల్ ను నిర్వహించడానికి వీలు పడలేదు. ఏదోలా ఈ టోర్నమెంట్ ను పూర్తీ చేయాలని బిసిసిఐ భావిస్తోంది. సౌరవ్ గంగూలీ కూడా ఐపీఎల్ ను నిర్వహించడానికే తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. 35 నుండి 40 రోజుల సమయంలో భారత్ లోనే పూర్తీ చేయాలని అనుకుంటూ ఉన్నామని.. అది వీలుపడకపోతే విదేశాల్లో టోర్నీని నిర్వహించాలని తాము భావిస్తూ ఉన్నామని అన్నారు. భారత్ కు ఇది చాలా ముఖ్యమైన టోర్నమెంట్ అని చెప్పారు గంగూలీ.. భారత్ లోని నాలుగు లేదా అయిదు గ్రౌండ్ లలో.. వీలు కాకపోతే విదేశాల్లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఏదో ఒకటి చేసి ఐపీఎల్ ను మొదలుపెడితే ధోని అభిమానుల కంటే ఎక్కువ ఆనందించే వారు ఉండరేమో..!Next Story