నాకోసం ధోనీ ఆ ప‌ని చేశాడు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 July 2020 3:00 PM GMT
నాకోసం ధోనీ ఆ ప‌ని చేశాడు.!

భారత జట్టుకు ఎంతో మంది కోచ్ లు పని చేసి ఉండొచ్చు. కానీ గ్యారీ క్రిస్టెన్ ను టీమిండియా అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. ఎందుకంటే ఆయన కోచ్ గా వ్యవహరిస్తున్నప్పుడే భారత్ వరల్డ్ కప్ ను ముద్దాడింది. అందుకే ఆయన్ను భారత ఆటగాళ్లు ఎంతో అభిమానంతో భుజాల మీద వేసుకుని మరీ గ్రౌండ్ లో తిప్పారు.

తాజాగా ఈ సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 2011 వరల్డ్ కప్ గెలవడానికి ముందు జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు గ్యారీ.

బెంగళూరు లోని ఎయిర్ స్కూల్ ను చూడాల్సిందిగా భారతజట్టును అప్పట్లో ఆహ్వానించారు. గ్యారీ క్రిస్టెన్, మరో ఇద్దరు సపోర్ట్ స్టాఫ్ వేరే దేశాలకు చెందిన వ్యక్తులు కావడంతో వారిని ఎయిర్ స్కూల్ లోకి అనుమతి ఇవ్వలేదు. 'పొటెన్షియల్ సెక్యూరిటీ థ్రెట్' గా భావించి వారికి అనుమతి ఇవ్వకపోవడంతో ధోని ట్రిప్ మొత్తాన్ని క్యాన్సిల్ చేశాడట.

'నేను కలిసిన మంచి వ్యక్తుల్లో ధోని ఒకడు.. అతడు గొప్ప లీడర్ మాత్రమే కాదు.. మంచి నమ్మకస్థుడు కూడా' అని రాధకృష్ణ శ్రీనివాసన్ నిర్వహిస్తున్న యూట్యూబ్ చాట్ షో 'ది ఆర్కే షో'లో వెల్లడించాడు. 'నేను వరల్డ్ కప్ ముందు చోటుచేసుకున్న ఘటనను ఎప్పటికీ మరచిపోలేను.. మేము బెంగళూరులో ఉండగా.. ఫ్లైట్ స్కూల్ కు వెళ్లాల్సి ఉంది. విదేశస్థులు ఉండడంతో వారిని అందులోకి అనుమతించరని టూర్ కు వెళ్లే రోజు ఉదయం సమాచారం అందింది. ముగ్గురు సౌత్ ఆఫ్రికన్లు నేను, ప్యాడీ ఆప్టన్, ఎరిక్ సిమన్స్ లను ఆ ఎయిర్ స్కూల్ లోకి అనుమతించరని చెప్పారు. దీంతో ఎమ్మెస్ ధోనీ మొత్తం ఈవెంట్ ను క్యాన్సిల్ చేసేశాడు' అని క్రిస్టెన్ తెలిపాడు. 'వీరంతా నా మనుషులు.. వాళ్లకు అనుమతి ఇవ్వకుంటే.. ఎవరూ వెళ్లడం లేదు' అని ధోని చెప్పాడని క్రిస్టెన్ తెలిపాడు.

ధోని నాకు ఎంతో నమ్మకస్థుడు. ధోని కూడా నన్ను అలాగే చూసేవాడు. మేము అన్నిసార్లు మ్యాచ్ లు గెలవలేదు. మాకు కూడా గడ్డుకాలం ఎదురైంది. అలాంటి సమయాల్లో కూర్చుని మాట్లాడుకున్నాం.. జట్టును ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలా అని ఆలోచించాం. ఇద్దరం కలిసి పనిచేస్తున్న సమయంలో మంచి అనుబంధం ఉండేదని గ్యారీ క్రిస్టెన్ తెలిపాడు.

సౌత్ ఆఫ్రికా లో భారత జట్టు 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత డిసెంబర్ నెలలో భారత జట్టు కోచ్ గా గ్యారీ క్రిస్టెన్ నియమితుడయ్యాడు. గ్యారీ కోచ్ గా ఉన్న సమయంలో భారతజట్టు టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని పొందింది. భారత్ లో జరిగిన 2011 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. 28 సంవత్సరాల తర్వాత భారతజట్టు వరల్డ్ కప్ ను గెలిచింది. భారత్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గ్యారీ క్రిస్టెన్ భారత కోచ్ పదవి నుండి తప్పుకున్నాడు.

Next Story