ఆర్చర్ ఎవరిని కలిశాడు..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2020 10:47 AM GMT
ఆర్చర్ ఎవరిని కలిశాడు..!

కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్‌ కార్యకలాపాలు ఏమీ సాగలేదు. దాదాపు నాలుగు నెలల తరువాత ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ జట్ల మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభమైంది. కరోనా కారణంగా కోవిడ్‌ నిబంధనలను ఐసీసీ తీసుకువచ్చింది. ఇక ఈ సిరీస్‌ను పూర్తిగా బయో సెక్యూర్‌ బబుల్‌ సృష్టించి ఆడిస్తున్నారు. అయితే.. ఇంగ్లాండ్‌ ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌ బయో సెక్యూర్‌ నిబంధనలను ఉల్లఘించి వేటుకు గురైయ్యాడు. దీంతో రెండో టెస్టులో అతను ఆడడం లేదు.

తొలి మ్యాచ్‌ అనంతరం ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు తమ సొంత కార్లలో వెళ్లేందుకు ఈసీబీ అనుమతి ఇచ్చింది. నేరుగా మాంచెస్టర్‌ వెళ్లాలని ఆదేశించింది. అయితే.. ఆర్చర్‌ ఆ నిబంధనల్ని పాటించకుండా ఇంటికి వెళ్లినట్లు ఈసీబీ గుర్తించింది. అతను సుమారు గంట సేపు తన ఇంటికి వెళ్లినట్లు బయటపడింది. దీంతో అతడిని రెండో టెస్టు ఆడేందుకు ఈసీబీ అనుమతించలేదు. ఐదు రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఈసీబీ ఆదేశించింది. మాంచెస్టర్‌లోని హోటల్‌ రూముకి పరిమితమైన ఆర్చర్.. కనీసం రూము వెలుపలికి వచ్చేందుకు కూడా అనుమతి లేదు. ఈ సమయంలో అతడికి రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా పరీక్షల్లో నెగిటివ్‌ వస్తేనే జట్టుతో కలవనున్నాడు. ఈ టెస్టు సిరీస్‌లో ఆటగాళ్లు, సిబ్బంది అంతా జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరాలను వాడుతున్నారు. మ్యాచ్‌ వేదికల్లో మాత్రమే ఇవి పని చేస్తాయి.

కాగా.. ఆర్చర్‌ తన ఇంటికి వెళ్లి తన గర్లఫ్రెండ్‌ను కలిసాడని వార్తలు వచ్చాయి. ది గార్డియన్ నివేదికల ప్రకారం.. జోఫ్రా ఆర్చర్ నేరుగా సౌతాంప్టన్ నుండి మాంచెస్టర్ కి వెళ్ళలేదని, ప్రోటోకాల్స్ ప్రకారం ఇంగ్లీష్ ఆటగాళ్ళు మరియు సిబ్బంది మాంచెస్టర్ చేరుకోగా.. ఆర్చర్ మాత్రం మార్గ మద్యలో సస్సెక్స్‌లోని తన ఇంటికి వెళ్లాడు. అక్కడ అతను తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలిశాడట. సుమారు ఓ గంట పాటు ఇంట్లో ఉండి ఆపై తన కారులో మాంచెస్టర్ చేరుకున్నాడట. అనంతరం మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. అయితే ఆర్చర్ గర్ల్‌ఫ్రెండ్‌కు నెగటివ్ ఉన్నప్పటికీ రూల్స్ బ్రేక్ చేశాడు కాబట్టి ఈసీబీ చర్యలు తీసుకుంది.

అయితే ది సన్ పత్రికలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. జోఫ్రా ఆర్చర్ తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి ఇంటికి వెళ్లలేదట. ఇంట్లో ఉన్న తన పెంపుడు కుక్కను చూడడనికి వెళ్లాడని పేర్కొంది. ఆర్చర్ స్నేహితులతో కూడా కుక్కను కలవడానికి అతడు ఇంటికి వచ్చాడని మీడియా సంస్థతో అన్నారు. దీంతో అతడు ఎవరిని కలవడానికి ఇంటికి వెళ్లాడు అనే ఆలోచనల్లో పడ్డారు అభిమానులు, బోర్డు. ఏదేమైనా ఆర్చర్ బయో సెక్యూర్ ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించి ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లని కూడా కరోనా ప్రమాదంలో పడేశాడని అందరూ మండిపడుతున్నారు.

Next Story