ఇద్దరు అమ్మాయిలకు తాళి కట్టిన వరుడు.. అదీ కూడా ఒకే వేదిక..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2020 12:45 PM IST
ఇద్దరు అమ్మాయిలకు తాళి కట్టిన వరుడు.. అదీ కూడా ఒకే వేదిక..

మీది ప్రేమ పెళ్లా..? లేదా పెద్దలు కుదిర్చిన వివాహమా..? అని అడిగితే.. ఏదో ఒకటి చెబుతారు. అయితే.. ఆ యువకుడు మాత్రం రెండూ అని సమాధానం చెబుతాడు. ఎందుకంటే ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని, పెద్దలు చూసిన అమ్మాయిని ఇద్దరిని పెళ్లిచేసుకున్నాడు. అది కూడా ఒకే మూహూర్తానికి. ఒకే వేదికపై. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌ జిల్లాలోని కెరియా గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కెరియా గ్రామానికి చెందిన సందీప్‌ అనే యువకుడుకి పక్క గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహాం నిశ్చయించారు పెద్దలు. అతడి అంగీకారం లేకుండా యువతి కుటుంబానికి మాట ఇచ్చేశారు. ఈ విషయాన్ని సందీప్‌కు చెప్పగా.. భోపాల్‌లో చదువుకునే సమయంలో ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. తాము చూసిన సంబంధాన్ని చేసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. దీంతో ఈ విషయం పంచాయతీకి చేరింది.

పంచాయతీ పెద్దలు మూడు కుటుంబాలను కూర్చోబెట్టి మాట్లాడారు. ఇద్దరు అమ్మాయిలకు ఇష్టం అయితే.. వారిద్దరిని పెళ్లి చేసుకోవచ్చునని తెలిపారు. దీనికి మూడు కుటుంబాలు అంగీకరించాయి. ఆ అమ్మాయిలు ఇద్దరూ కూడా అతడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డారు. దీంతో ఆ ఇద్దరి మెడలో తాళి కట్టాడు. మొత్తానికి ఆ పెళ్లి కొడుకు తన పంతంతో పాటు.. పెద్దల మాటను నిలబెట్టాడు. అయితే ఈ విషయం ప్రభుత్వ అధికారుల దృష్టికి రావడంతో దీనిపై విచారణ చేపట్టారు.

Next Story