మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పోస్టర్ పై వివాదం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Aug 2020 11:40 AM IST
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పోస్టర్ పై వివాదం..!

అక్కినేని అఖిల్, పూజా హెగ్డే నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్'. ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన రొమాంటిక్‌ పోస్టర్‌ విడుదలైంది. పూజా హెగ్డే అందాన్ని క‌న్నెత్తి కూడా చూడకుండా ముందున్న ల్యాప్‌ట్యాప్‌లోనే మొహం పెట్టి త‌న ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాడు. పూజా కాలితో అఖిల్ చెవిని మెలిపెడుతున్న పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఈ పోస్టర్ ను అక్కినేని అభిమానులు, ఇంకొందరు తప్పుబట్టారు. కాలితో అలా తాకడం వలన తమ మనోభావాలు దెబ్బతిన్నాయని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ పోస్టర్ చూశామని చాలా చెత్తగా ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. 'ఏందిరా ఇది.. దీన్ని మేము తప్పుబడుతున్నాం' అని ఇంకొకరు పోస్టు పెట్టారు. అక్కినేని అఖిల్ కెరీర్ లోని చెత్త స్టిల్ ఇదని మరొకరు ట్వీట్ చేశారు. మేము సూపర్ స్టైలిష్ రొమాంటిక్ లుక్ వస్తుందని ఎదురుచూశాము.. కానీ మీరు పెట్టిన పోస్టర్ చాలా చెత్తగా ఉంది. ఈ సినిమా మీద ఆశలు పెట్టుకోవడం మానేసి అఖిల్ అయిదవ చిత్రం గురించి ఆలోచిద్దామని మరో నెటిజన్ పోస్టు పెట్టారు. ఇలాంటి పోస్టర్ ను చూస్తే మీ వదిన ఫీలవదా అంటూ సమంతను ట్యాగ్ చేశారు మరికొందరు. 'కాలు తీయండి పూజ గారు మా అయ్యగారి మీద.. మేము హర్ట్ అవుతాము' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.

సమంతను ప్రశ్నిస్తూ:

2014లో వచ్చిన 'వన్.. నేనొక్కడినే' మహేష్ బాబు సినిమాకు సంబంధించిన పోస్టర్ లో హీరోయిన్ కృతి సనన్ మహేష్ బాబు పాదాలను వెనుకనుండి తాకుతున్న ఫోటోపై సమంత అప్పట్లో కామెంట్లు చేసింది. తనకు నచ్చలేదని అప్పట్లో సమంత చెప్పుకొచ్చింది. దీనిపై మహేష్ బాబు ఫ్యాన్స్ అప్పట్లో సమంతను బాగా ట్రోల్ చేశారు.

ఇప్పుడు మరోసారి సమంతను కొందరు అభిమానులు టార్గెట్ చేసి ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. సమంత అప్పుడు మహేష్ బాబు పోస్టర్ గురించి చేసిన వ్యాఖ్యలు మరచిపోయిందా.. ఇప్పుడు తన మరిది సినిమా గురించి ఏమీ మాట్లాడదా అని సమంత మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. సమంత మౌనం వీడాలని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

'బొమ్మ‌రిల్లు' భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, వాసు వ‌ర్మ నిర్మించారు. గోపీ సుంద‌ర్ సంగీత‌మందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు.

Next Story