దారి తప్పి మోహన్ బాబు ఇంటికి వెళ్లారట.. బెదిరించింది ఎందుకో..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Aug 2020 4:04 PM ISTహైదరాబాద్ లోని మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లిన కొందరు దుండగులు మిమ్మల్ని వదలబోమంటూ వార్నింగ్ ఇచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏపీ 31 ఏఎన్ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు తెలుస్తుంది. మోహన్ బాబు నివాసంలోకి ఓ కారులో దూసుకెళ్లిన దుండగులు మిమ్మల్ని వదలబోమంటూ ఆయన కుటుంబ సభ్యులను హెచ్చరించారు. మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా లేని సమయంలో దూసుకెళ్లిన కారులో నుండి దిగిన వ్యక్తులు సీరియస్ వార్నింగ్ ఇచ్చి అదే కారులో వెళ్లిపోయారు.
హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జల్‌పల్లిలో మోహన్‌బాబు ఫాంహౌస్‌లోని ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ దృశ్యాలు, కారు నంబరు ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితులంతా మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల కాల్‌డేటాను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి పేర్లు రాఘవేంద్ర, ఆనంద్, గౌతమ్, డేవిడ్‌గా గుర్తించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ యువకుల తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఫాంహౌస్ చూడడానికే తమ పిల్లలు అక్కడికి వెళ్లారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దాడి చేయడానికి వెళ్లలేదని వారు వివరించారు. దారి తప్పి మోహన్‌బాబు ఫాంహౌస్‌కి వెళ్లి ఉండొచ్చని చెబుతున్నారు. బెదిరించాల్సిన అవసరం ఏముంది అన్నది కూడా తెలియాల్సి ఉంది.