బిడ్డ భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిదండ్రుల మాదిరిగానే జార్ఖండ్‌ కోసం కృషి చేస్తున్నా: మోదీ

By Newsmeter.Network  Published on  3 Dec 2019 2:01 PM GMT
బిడ్డ భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిదండ్రుల మాదిరిగానే జార్ఖండ్‌ కోసం కృషి చేస్తున్నా: మోదీ

ఎదుగుతున్న బిడ్డ భవిష్యత్తు గురించి ఆరాటపడే తల్లిదండ్రుల మాదిరిగా తాను కూడా జార్ఖండ్ కోసం కృషి చేస్తున్నానని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జార్ఖండ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఖుంతిలో నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడుతూ.... జమ్మూ-కశ్మీరులో కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని, అధికరణ 370ని రద్దు చేసినట్లు చెప్పారు. 'మేం అధికరణ 370ని రద్దు చేశాం... ఇది కాంగ్రెస్ సృష్టించిన పీడ. మేము కొత్త సమస్యలేవీ రాకుండా జాగ్రత్తలు తీసుకుని, దాని అంతు చేశామన్నారు. జమ్మూ-కశ్మీరు అభివృద్ధికి జార్ఖండ్ ప్రజలు సహాయపడతారని నాకు తెలుసు అని అన్నారు. జార్ఖండ్‌‌ను ఎదుగుతున్న బిడ్డగా అభివర్ణించిన మోదీ...జార్ఖండ్ వయసు 19 ఏళ్ళు అని అన్నారు. టీనేజర్‌గా గడిపే సమయం త్వరలోనే ముగిసిపోతుందని, మీరంతా నాకు మద్దతివ్వాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. జార్ఖండ్‌ వయసు 25 ఏళ్ళు వచ్చేసరికి మీరు దీనిని గుర్తించలేరని భరోసా ఇస్తున్నానని మోదీ పేర్కొన్నారు.

గడిచిన సంవత్సరాలలో దేశంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని అన్నారు. తమకు ఎవరెన్ని అడ్డుంకులు సృష్టించినా, ఎదురెళ్లి పోరాడుతున్నామని అన్నారు. నిరుపేద ప్రజలకు ఎన్నో పథకాలు తీసుకువచ్చి, అందరి మన్ననలు పొందామని గుర్తు చేశారు. జార్ఖండ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూయిస్తానని భరోసా ఇచ్చారు. కాగా, జార్ఖండ్ శాసన సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ఈ నెల 7న జరుగుతుంది. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదా కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

Next Story