నారా లోకేష్‌పై ఎమ్మెల్యే రోజా వ్యంగ్యాస్త్రాలు
By సుభాష్ Published on 11 Dec 2019 6:46 PM ISTఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇటు టీడీపీ నేతలు, అటు వైసీపీ నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటున్నారు. మేమంటే మేము అన్నట్లు ఒకరిపై ఒకరు నిందారోపణలకు దిగుతున్నారు. నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా అటు చంద్రబాబు, నారా లోకేష్‌లపై మండిపడిపోతున్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ నేతలు ఉదయాన్నే లేచి నారా లోకేశ్‌తో ప్రెస్‌మీట్ పెట్టించారు. ఆయన ప్రెస్‌మీట్ చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంటున్నారు... ఔను నా కాళ్లు కూడా వణుకుతున్నాయి’అంటూ రోజా ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ మీడియా లాబీ వద్ద ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. మంగళగిరి అని పలకడానికి నారా లోకేశ్ ట్యూషన్ పెట్టించుకున్నారని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను మాట్లాడనివ్వడం లేదని, చంద్రబాబు కళాకారులకు అన్యాయం చేస్తున్నారని రోజా ఆరోపించారు. అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ప్రాజెక్టుల గురించి మాట్లాడకుండా.. రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని, దీనిపై సొంత పార్టీ శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలే ఎద్దేవా చేస్తున్నారని ఆమె అన్నారు. లోకేష్‌కు ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడాలోకూడా తెలియని పరిస్థితి దాపురించిందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రోజా లోకేష్, బాలయ్యలను టార్గెట్ చేశారు. మహిళా భద్రతకు సంబంధించి జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ఆమె ఇద్దరిపై సెటైర్లు వేశారు. లోకేష్ ఫోటోలు, బాలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బయటపడతాయనే అసెంబ్లీలో మహిళ భద్రతపై జరుగుతున్న చర్చను అడ్డుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు సొంత కొడుకును కూడా గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. లోకేష్‌కు జయంతి, వర్థంతికి కూడా తేడా తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.