అగ్నిప్రమాద స్థలిని పరిశీలించిన మంత్రులు
By తోట వంశీ కుమార్ Published on 9 Aug 2020 1:11 PM ISTవిజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరింది. అగ్ని ప్రమాద స్థలిని మంత్రులు సుచరిత, ఆళ్లనాని, వెల్లంపల్లి, ఎంపీ మోపీదేవి వెంకటరమణ పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి ఆళ్ల నాని మాట్లాడారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. ప్రమాదంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశామని, సహాయకచర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
'తెల్లవారు జామున 4.30 నుంచి 5గంటల మధ్యలో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ప్రమాద సమయంలో భవనంలో 43 మంది ఉన్నారు. వీరిలో 30 మంది కొవిడ్ రోగులు ఉన్నారు. 20 మందికి ఎలాంటి ప్రాణపాయం లేదు అని ఆళ్లనాని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు..? నిర్లక్ష్యం వల్ల జరిగిందా..? లాంటి విషయాలను కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్షించిన అనంతరం తెలియజేస్తామని' ఆయన తెలిపారు.