ఫిబ్రవరిలోపు అంతర్వేదిలో రథం నిర్మాణం : మంత్రి వెలంప‌ల్లి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Sep 2020 9:28 AM GMT
ఫిబ్రవరిలోపు అంతర్వేదిలో రథం నిర్మాణం : మంత్రి వెలంప‌ల్లి

వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయి. అప్పటిలోగా అంద‌రి అభిప్రాయాల మేర‌కు రథం ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా రథాన్ని సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను అదేశించిన్న‌ట్లు దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు.

సొమ‌వారం బ్రాహ్మ‌ణ వీధిలో దేవ‌దాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ పి. అర్జున‌రావు‌తో మంత్రి వెలంప‌ల్లి స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైందన్నారు.

రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించారన్నారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించారన్నారు. ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా రూపొందిస్తున్నారు. కొత్త రథం నిర్మాణంతో పాటు.. ర‌థ‌శాల మరమ్మతులు నిమిత్తం రూ. 95 లక్షలు ఖర్చవుతుందని.. దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించడం జ‌రిగింద‌ని మంత్రి అన్నారు. ఈ స‌మావేశంలో దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ పి. అర్జున‌రావు, ఎస్ఈ శ్రీ‌నివాస‌రావు పాల్గొన్నారు.

ఇదిలావుంటే.. కొద్దిరోజుల క్రితం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహాస్వామి కల్యాణమహోత్సవ రథం దగ్ధం అయ్యింది. ఈ విష‌య‌మై తీవ్ర రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు చెల‌రేగిన నేఫ‌థ్యంలో.. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవ‌రైనా కావాల‌నే చేశారా అనే కోణాల‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేర‌కు కేసును సీబీఐకి బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story
Share it