మే 3 తర్వాత కూడా ఎలాంటి సడలింపులు ఉండవు: కేంద్ర మంత్రి

By సుభాష్  Published on  29 April 2020 10:50 AM GMT
మే 3 తర్వాత కూడా ఎలాంటి సడలింపులు ఉండవు: కేంద్ర మంత్రి

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కాలరాస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక దేశ వ్యాప్తంగా మే 3తో లాక్‌డౌన్‌ ప్రకటించిన కేంద్రం.. తెలంగాణలో మాత్రం మే 7వ తేదీ వరకూ కొనసాగనుంది. అయితే కంటైన్‌మెంట్‌, రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో మే 3 తర్వాత కూడా ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్‌ జోన్‌ ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని, పరిశ్రమలు, మిగతా అన్ని పనులు చేసుకునే వీలుంటుందని అన్నారు.

లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఉన్న ప్రాంతాల్లో కూడా సోషల్‌ డిస్టెన్స్‌, మాస్కులు ధరించడం తప్పని సరి అని అన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ శాతం రెడ్‌ జోన్‌, హాట్‌స్పాట్‌ ప్రాంతాల నుంచే వస్తున్నాయని అన్నారు. కరోనా కట్టడి విషయంలో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను పగడ్బందీగా నిర్వహించడం వల్ల కరోనా కట్టడిలోకి వచ్చిందని, అందుకే ఆ రాష్ట్రాల్లో కొన్ని నిబంధనలతో కూడిన సడలింపులు ఇచ్చామని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏ రాష్ట్ర ప్రజలైనా ఇరు రాష్ట్రాల సమన్వయంతో వారిని సొంత రాష్ట్రాలకు తీసుకువచ్చేందుకు అవకాశం ఉందని, విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు.

ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్రం ప్రయత్నాలు

ఆర్థిక అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే గ్రీన్‌ జోన్‌లో, గ్రామీణ ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చామని పేర్కొన్నారు. కరోనాను తరిమికొట్టేందుకు వ్యాక్సిన్‌ తయారీలో అన్ని దేశాలు శ్రమిస్తున్నాయని, మన దేశంలో కూడా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు పరిశోధనలు ప్రారంభించాయన్నారు. ఇక ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాన్‌ యోజన కింద అన్ని రాష్ట్రాలు రెండో విడత సహాయం తీసుకోవాలని, తెలంగాణకు ఈ పథకం కింద రూ.2,719 కోట్లు కేటాయించామని మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Next Story