ఆ కార్మికులకు నెలకు రూ. 1500 సాయం: కేసీఆర్‌ కీలక నిర్ణయం..!

By సుభాష్  Published on  29 April 2020 4:45 AM GMT
ఆ కార్మికులకు నెలకు రూ. 1500 సాయం: కేసీఆర్‌ కీలక నిర్ణయం..!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున సామాన్య ప్రజలకు, దినసరి కూలీలకు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కరోనా వల్ల వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. దీంతో చిన్న ఉద్యోగులు, కూలీలు సైతం ఉపాధి కోల్పోయారు.

ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. వీరంతా రోజు కూలీ చేసుకుంటేనే పొట్టనిండే పరిస్థితి. అటువంటిది లాక్‌డౌన్ కారణంగా పనులు లేక విలవిలలాడిపోతున్నారు. తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. వారి దుర్భర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.1500 చొప్పున మూడు నెలల పాటు సాయం అందించాలని కేసీఆర్‌ సర్కార్‌ భావిస్తోంది. పేదలకు ఇచ్చే బియ్యం, నగదు సాయానికి అదనంగా ఏప్రిల్‌ నుంచే ఈ సాయం అందించాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను వాడుకోవాలని ఆలోచిస్తోంది.

మార్చి 24న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత దేశంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర కార్మిక శాఖ పలు మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రభుత్వాలు వసూలు చేసే కార్మిక సంక్షేమసెస్‌ మొత్తాన్ని డీబీటీ ద్వారా కార్మికుల ఖాతాల్లో వేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలో 15 లక్షలకు పైగా కార్మికులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

Next Story