అయ్యన్నపాత్రుడుకి మతిభ్రమించింది : మంత్రి జయరాం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sept 2020 4:01 PM IST
అయ్యన్నపాత్రుడుకి మతిభ్రమించింది : మంత్రి జయరాం

ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం.. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుపై విరుచుకుపడ్డారు. అయ్యన్నపాత్రుడుకి మతిభ్రమించిందని.. అడ్డదారిలో ట్విటర్‌లో రాజకీయాలు చేసే వ్యక్తి లోకేష్ అని.. ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరాడని.. బుద్దా వెంకన్నకు బుద్ధిలేదని మంత్రి టీడీపీ నాయ‌కుల‌పై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

ఇక‌.. కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే నేను విచారణకు ఆదేశించాన‌ని మంత్రి జయరాం అన్నారు. విచారణలో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు 2014-18 మధ్య అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలిందని అన్నారు. అందులో భాగంగానే అచ్చెన్నాయుడును అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామ‌ని మంత్రి అన్నారు.

కార్తీక్ 2019 డిసెంబర్‌లోనే బెంజ్‌ కారును కొనుగోలు చేశాడని.. అయితే కారుకు సంబంధించిన నెల వాయిదాలు స‌రిగా కట్టకపోవడంతో ఫైనాన్స్ సంస్థ‌‌ బెంజ్ కారును సీజ్ చేసిందని మంత్రి అన్నారు. 2020 జూన్‌లో ఈఎస్‌ఐ కుంభకోణం కింద కార్తిక్‌పై కేసు నమోదయ్యింద‌ని.. ఒక‌వేళ‌ కారు తీసుకొని ఉంటే.. ఈఎస్‌ఐ స్కాంలో A14 ముద్దాయిగా ఉన్న కార్తిక్‌ పేరును తాను ఎందుకు తొలగించలేదో చెప్పాలని మంత్రి టీడీపీ నాయకులను ప్ర‌‌శ్నించారు. నేను భూమి కొనుగోలులో అన్ని పేపర్లు కరెక్టుగా ఉన్నందుకే కొన్నాన‌ని.. ఎక్కడా భూకజ్జాకి పాల్పడలేదని మంత్రి అన్నారు.

అంత‌కుముందు.. ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏ14 నిందితుడు కార్తీక్.. మంత్రి జయరాంకు బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతికి పాల్ప‌డ్డ‌ మంత్రి జయరాంపై సీఎం జగన్ ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూస్తామని అన్నారు.

Next Story