చంద్రబాబు రాజధాని పర్యటనపై బొత్స ఫైర్...

By Newsmeter.Network  Published on  28 Nov 2019 1:23 PM GMT
చంద్రబాబు రాజధాని పర్యటనపై బొత్స ఫైర్...

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ ఫైర్‌ అయ్యారు. నాలుగేళ్లలకాలంలో రాజధాని కోసం చంద్రబాబు ఏం ఊడబొడిచారని ఎద్దేవా చేశారు. గతంలో రాజధాని రైతుల కోసం ఇచ్చిన జీవోలను తప్పకుండా అమలు చేస్తామన్న చంద్రబాబు...ఆ జీవోలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆరు నెలల కాలంలో మ్యానిఫెస్టో లో చెప్పిన అంశాలను అత్యధిక శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ కే దక్కిందన్నారు. ఈ రోజు ఏపీ సచివాలయంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లడారు. క్రొత్త ప్రభుత్వానికి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయని, కాస్త సమయం కావాలని, ప్రతిపక్షాలు మాత్రం మొదటి రోజు నుండే ప్రభుత్వం పై దాడి చేయడం ప్రారంభించాయని అన్నారు. రైతు భరోసా...ఇసుక..ఇంగ్లీష్ మాధ్యమం లాంటి అనేక విషయాల్లో మాపై విమర్శలు చేయడం, ఆ తరువాత నాలుక కరుచుకోవడం చంద్రబాబు కి అలవాటు గా మారిందని మండిపడ్డారు. మాతృభాష కు మేమెప్పుడూ వ్యతిరేకం కాదని, కేవలం ఆంగ్లభాష అవసరాన్ని మాత్రం మేము గుర్తిస్తున్నామన్నారు. దీనిపై కూడా తన అనుకూల పత్రికల్లో మాపై విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. సామాన్యుడు ఇంగ్లీష్ లో చదువుకోవడం చంద్రబాబు కి నచ్చడం లేదని, చంద్రబాబు ఇప్పుడు మళ్లీ రాజధాని పర్యటన అంటున్నారన్నారు. మొన్న అబద్దాలు చెప్పి వెళ్లిన టీడీపీ టీమ్ ....ఇప్పుడు చంద్రబాబు వంతుగా మారిందని విమర్శించారు.

ఆయన హయాంలో రాజధానిలో నాలుగంటే నాలుగే భవనాలు కట్టారని, ఐదేళ్లు అవకాశం ఇస్తే నిర్మించకుండా గొర్రెలు కాశారా..? అంటూ ఆరోపించారు. అధికారంలో ఉన్ననాళ్లూ వేటినీ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు విధానాలన్నీ వల్లకాడు విధానాలేనని, రాజధాని రైతులకిచ్చిన ప్లాట్ల అభివృద్ధి, కౌలు వంటి అంశాలపై ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. రాజధాని పర్యటకు వస్తున్న చంద్రబాబుకు రైతులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారన్నారు. ల్యాండ్ పూలింగ్ నిబంధనలకు మేము కట్టుబడి ఉన్నామని, భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉన్నామన్నారు బోత్స.

పర్యటనకు వస్తున్న చంద్రబాబు ముందు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లక్ష కోట్ల బడ్జెట్ వేసి.. సుమారు 5 వేలకోట్లు మాత్రమే రాజధాని కి ఉపయోగించారని, ఇంతకంటే అన్యాయం ఉందా...అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని రైతులు చంద్రబాబు మాయలో పడొద్దని, ప్రతిపక్షంలో ఉన్నామని చంద్రబాబు ఏదేదో మాట్లాడ్డం.. ఆ తర్వాత యూ టర్న్ తీసుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. హడావుడి చేయడం.. ప్రజల నుంచి తిరస్కరణ గురి కావడం.. దాంతో సైలెంట్ అయిపోవడం చంద్రబాబుకు మామూలేనని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఎవర్ని తిడతారో.. ఎవర్ని పొగుడుతారో.. ఎవ్వరికీ తెలియదన్నారు. జగన్‌ సీఎంగాం బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోని అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. సీఎం అయిన తర్వాత జగన్‌ తక్కువ కాలంలో చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదన్నారు.

Next Story