మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్‌.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2020 2:08 PM GMT
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్‌.. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

తమిళనాడులోని ఓ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద నిన్న ఆ రాష్ట్ర పోలీసుల తనిఖీల్లో ఓ కారులో దొరికిన ఐదు కోట్ల నగదుతో తనకు సంబంధం లేదని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఆ నగదు తనదే అని టీడీపీ నేతలు నిరూపిస్తే తాను మంత్రి పదవిని వదులుకోవడమే కాక.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి సవాల్‌ చేశారు.

తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో ఓ చెక్ పోస్ట్ స‌మీపంలో అటుగా వస్తున్న ఓ కారును ఆపి తనిఖీ చేశారు పోలీసులు. ఎలాంటి ప్రయాణ అనుమతి లేకుండా ఆ వాహనంలో ముగ్గురు వ్యక్తులు సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి వస్తున్నట్టు గుర్తించారు. కారును పూర్తిగా తనిఖీ చేసిన పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ వాహనంలో భారీగా నగదు ఉంది. దానికి ఎటువంటి పత్రాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒంగోలుకు చెందిన ఇద్దరు, చిలకలూరిపేటకు చెందిన ఒకరు ఉన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఏపీ సరిహద్దులు దాటి తమిళనాడులోకి ఆ వాహనం ఎందుకు వచ్చిందని ఆరా తీస్తున్నారు పోలీసులు.

వాహనం ఏపీకి చెందిన మంత్రి బాలినేనిదని తమిళ మీడియాలో ప్రచారం సాగుతుండటంతో హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పందించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా మహేశ్వరరావు నోరు అదుపులో పెట్టాలని అన్నారు. అధికారంలోకి అడ్డదారిలో వచ్చిన లోకేష్‌ వేల కోట్లు సంపాదించి, తమపై ఆరోపణలు చేస్తున్నారని, తన గురించి ఒంగోలులో టీడీపీ నేతలను కనుక్కోవాలన్నారు. తనపై ఆరోపణలను రుజువు చేయకపోతే లోకేష్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జీవితంలో ఒక్క సారి కూడా ఎమ్మెల్యేగా లోకేష్‌ గెలవలేరన్నారు. నాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాన‌ని వెల్ల‌డించారు. కారుపై ఉన్న స్టిక్కర్‌ ఫోటో షాప్‌ లో తీసుకుని ఎవరో అంటించుకున్నారని తెలిపారు.

Next Story