ఓఎల్ఎక్స్‌లో మూములుగా అయితే పాత వస్తువులను అమ్ముతుంటారు. కార్లు, బైక్‌లతో పాటు టీవీలు, సోఫాలు వంటి వ‌స్తువులు అక్కడ సెంక‌డ్‌హ్యాండ్‌గా త‌క్కువ‌ధ‌ర‌కు ల‌భిస్తాయి. అయితే.. తాజాగా యుద్ధ విమానం కూడా అమ్మకానికి వచ్చింది ఓఎల్ఎక్స్‌కు.

మిగ్-23 ఫైటర్ జెట్‌ను రూ.9.99 కోట్లకు అమ్ముతానని ఓ గుర్తు తెలియని వ్యక్తి అమ్మ‌కానికి పెట్టాడు. ఓఎల్ఎక్స్‌లో యుద్ధ విమానం కనిపించడంతో చాలా మంది షాక్ అయ్యారు. ఏంటి యుద్ధ విమానాన్ని కూడా ఓఎల్ఎక్స్‌లో అమ్ముతారా? అని నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఈ వార్త‌ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలావుంటే.. వాడ‌కంలో లేని మిగ్‌-23బిఎన్‌ యుద్ధ విమానాన్ని 2009లో అలీఘఢ్ ముస్లిం యూనివర్సిటీకి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అప్పగించింది. ఏరోనాటికల్, మెకానికల్ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడుతుందని గిఫ్ట్‌గా ఇచ్చారు. అలీఘఢ్ ముస్లిం యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీ ముందు దాన్ని ప్రదర్శనకు ఉంచారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న యుద్ధ విమానం అది.

అయితే.. ఇంతటి చరిత్ర ఉన్న ఆ విమానాన్ని ఇటీవల ఓ ఆకాతాయి ఫోటో తీసి ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. దానికి రూ.9.99 కోట్ల ధరను నిర్ణయించాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో యూనివర్సిటీ అధికారులు స్పందించారు. ఇది తప్పుడు ప్రకటన అని.. అలీఘఢ్ ముస్లిం యూనివర్సిటీ పేరును చెడగొట్టేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.