సుదీర్ఘ పోరాటం – స్వప్నం సాకారం

By మధుసూదనరావు రామదుర్గం  Published on  5 Aug 2020 10:37 AM GMT
సుదీర్ఘ పోరాటం – స్వప్నం సాకారం

చిరకాల భక్తుల స్వప్నం సాకారం అయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోట్లాది భారతీయుల ఆకాంక్ష. ఆగస్టు 5న అంటే ఇవాళ ఆ సత్కార్యానికి శ్రీకారం చుట్టారు. దేశప్రధాని నరేంద్ర మోది, యూపీ సీఎం యోగి, యూపీ గవర్నర్‌ ఆనంద్‌బెన్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితర ప్రముఖుల సమక్షంలో మధ్యాహ్నం 12.44 నిమిషాలకు ప్రధాని చేతులమీదుగా రామమందిర నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ జరిగింది. ఆలయం పొడవు 280–300 అడుగులు, వెడల్పు–270–280 అడుగులు, ఎత్తు 161 అడుగులు ఉండేలా నిర్మించబోతున్నారు. మూడేళ్ళలోగా రామాలయాన్ని నిర్మించాలని ట్రస్ట్‌ సంకల్పం.

కరోనా దుమారం ఓవైపు ఉన్నా.. పరిమిత ఆహ్వానితుల నడుమ ఈ అద్భుత కార్యక్రమాన్ని జరిపారు. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని అయోధ్యలోనే కాదు దేశవ్యాప్తంగా రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత హనుమాన్‌ గడిలో పూజలు నిర్వహించిన మోదీ.. రామ్‌లల్లా ఆలయంలో సాష్టాంగ నమస్కారం చేశారు. పండితుల వేదఘోష నడుమ సంకల్ప దీక్ష తీసుకుని శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రధాని దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ...

‘ఇవాళ శుభదినం. భక్తుల కల ఫలించింది. మూడు దశాబ్దాలా నిరీక్షణానంతరం అడ్డంకులు అధిగమించి అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సిద్ధమవుతున్నాం. ఈ శుభసమయం కోసం భారతదేశం ఒక్కటే కాదు ప్రపంచం మొత్తం ఉద్విగ్నంగా ఎదురుచూస్తోంది. ఇవాళ అయోధ్యలో రామఘోష రాముడికి వినిపిస్తుందో లేదో గానీ ప్రపంచంలోని కోట్లాది భక్తులకు మాత్రం వినిపిస్తుంది. ఇన్నేళ్ళు టెంటులో ఉన్న రామమందిరి ఇక దివ్యమందిరింగా భాసిస్తుంది. శ్రీరాముడు అంటేనే మర్యాద పురుషోత్తముడు. అలాంటి పురుషోత్తముడి మందిర నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు తొలిగాక మార్గం సుగమం అయింది. దేశం కోసం పోరాడిన వీరులను నేతలను ఆగస్టు 15న స్మరించుకుంటున్నాం. అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం బలిదానం అయిన ఎందరో భక్తాగ్రేసరులను ఇవాళ స్మరించుకుంటున్నాం. స్వతంత్ర దినోత్సావానికి ఎంత ప్రాధాన్యముందో రామమందిర నిర్మాణ ప్రారంభానికి అంతే ప్రాముఖ్యత ఉంది. మన అస్తిత్వాన్ని అణచివేయాలని సమూలంగా నిర్మూలించాలని కొందరు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎందుకంటే.. మన అస్తిత్వం అంటే మరేదో కాదు ధర్మమూర్తి అస్తిత్వం. అందుకే అంటున్నా.. రామమందిర నిర్మాణం దేశ సమగ్రతను సంరక్షించే జాతీయ భావన. మనం ఆచరించే ప్రతి ఆదర్శంలో శ్రీరామతత్వం ఉంటుంది.

రామాయణం ఒక భారతదేశానికే పరిమితం కాలేదు. కంబోడియా, మలేసియా, థాయిలాండ్‌లలోనూ రామాయణగాథలు వినిపిస్తాయి. శ్రీలంక, నేపాల్‌లో రాముడు,జానకీమాత కతలు వినవస్తాయి. రామో విగ్రహవాన్‌ ధర్మః అన్నారు. అంటే రాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు. సత్యపాలన, సమయపాలన, ప్రేమ పూరిత సంభాషణ...రాముడి శుభలక్షణాలు. చిన్ననాటి నుంచి రామకథ వింటూ పెరిగిన భారతీ యులకు రామాయణం అంటే ప్రాణం. భారతీయాత్మ అందులో ప్రతిఫ లిస్తుంటుంది. శ్రీరామచంద్రుడి ప్రేరణతోనే భారతం ప్రగతి పథాన దూసుకుపోతుంది’ అని భావోద్వేగంతో ప్రసంగించారు.

రాముడు.. న్యాయ పరిరక్షకుడు :

రామమందిర నిర్మాణం కోసం సాగిన అవిశ్రాంత పోరాటం ఓ ధర్మపోరాటం. ఇది వెయ్యేళ్ళనుంచి వస్తున్న మత విశ్వాసం, శతాబ్దాల కిందట జరిగిందంటున్న విధ్వంసం, దశాబ్దాలుగా భూమి హక్కు కోసం సాగిన పోరా టానికి నిలువెత్తు రూపం త్వరలో మన ఎదుట సాక్షాత్కారమయ్యే రామాలయం. అయోధ్య చట్టం కింద సమీకరించిన 67 ఎకరాల భూమిని ఇటీవలే రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌కు బదలాయించారు. రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించే రామాలయం అణువణువు విశేషాలతో శోభాయమానంగా ఉండేలా తీర్చిదిద్దబో తున్నారు.

మూడంతస్తులుగా నిర్మితమవుతున్న ఈ రామమందిరాన్ని ఒకేసారి పదివేల మంది భక్తులు దర్శించుకునే వీలుంది. నిర్మాణానికే ముందు భూ పరీక్షలు నిర్వహించి, రిక్టార్‌ స్కేలుపై 10 తీవ్రతతో భూకంపం వచ్చిన తట్టుకునేంత దృఢంగా ఆలయాన్ని నిర్మించబోతున్నారు. వెయ్యేళ్ళపాటు చెక్కుచెదరకుండా ఉండేలా పటిష్టంగా నిర్మించే ఈ రామాలయంతో అయోధ్య ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారనుంది. సమస్యను రాజకీయ కోణంలో చూడనప్పుడు మాత్రమే పరిష్కారం లభించేవీలుంది అన్న వాజ్‌పేయి మాటల్లోని స్ఫూర్తికి ప్రతీకగా ఇవాళ భూవివాద సమస్య నుంచి విముక్తి పొంది రామాలయం నిర్మాణానికి బీజం పడింది.

ఇదే సందర్భంగా భాజపా అగ్రనేత అడ్వాణీ అయోధ్యలో రామమందిర నిర్మాణ ముహూర్తం దేశప్రజలతోపాటు తనకూ భావోద్వేగమైన క్షణాలేనని తెలిపారు. అడ్వాణీ 1990లో రామమందిర నిర్మాణం కోసం భాజపా అధ్యక్షుని హోదాలో సోమనాథ్‌ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత వారి పోరాటం ఫలించి రామమందిర స్వప్నం సాకారమైంది.

Next Story
Share it