టాలీవుడ్‌లో పెళ్లిగోల
By రాణి Published on 28 July 2020 3:42 PM IST- త్వరలోనే రానా పెళ్లి
- ఆగస్టులో నిహారిక - చైతన్యల నిశ్చితార్థం
కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీకి తెచ్చిపెట్టిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లాక్ డౌన్ పుణ్యమా అని మూడు నెలల వరకూ షూటింగులు జరుగలేదు సరికదా.. కనీసం షూటింగులు పూర్తి చేసుకున్న సినిమాలు కూడా విడుదలకు నోచుకోలేదు. ఆగస్టు 1 నుంచి మొదలయ్యే అన్ లాక్ 3 లో థియేటర్లు తెరుచుకుంటాయని వార్తలు షికార్లు చేస్తున్నాయి కానీ.. అదెంత వరకు ఆచరణ సాధ్యమో ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో టాలీవుడ్ హీరోలు మెల్ల మెల్లగా పెళ్లిబాట పడుతున్నారు. లాక్ డౌన్ కన్నా ముందే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న నిఖిల్, నితిన్ లు ఓ ఇంటి అల్లుళ్లు అయిపోయారు. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా తాను ప్రేమలో పడిన విషయాన్ని ఇన్ స్టా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుని అందరినీ షాక్ కు గురిచేశాడు. ఇటు మెగా వారింటి ఆడపడుచేమీ తక్కువ కాదన్నట్లు..తన పెళ్లి విషయాన్ని బయట పెట్టేసింది.
లాక్ డౌన్ కన్నా ముందే తన ప్రేయసి డాక్టర్ పల్లవి వర్మతో నిశ్చితార్థం చేసుకున్నాడు నిఖిల్. అంతా బాగానే ఉంటే అంగరంగ వైభవంగా జరగాల్సింది వారి పెళ్లి. కానీ కరోనా రక్కసి కారణంగా నిరాడంబరంగా మే 14వ తేదీన నిఖిల్ - పల్లవి లు ఒక్కటయ్యారు. ఇటు హీరో నితిన్ పరిస్థితి కూడా అంతే. ఐదేళ్లుగా షాలిని ని ప్రేమించిన నితిన్ ఇటీవలే తన ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. ఎంగేజ్ మెంట్ చేసుకునే లోపే లాక్ డౌన్ వచ్చేసింది. ఎప్పటి కైనా కరోనా తగ్గకపోతుందా.. దుబాయ్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోవచ్చని అని ఎదురుచూశారు. కానీ కరోనా వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఎందరో అతిథుల మధ్య అంగరంగవైభవంగా జరగాల్సిన నితిన్ - షాలినీల పెళ్లి అతికొద్ది బంధుమిత్రుల మధ్య జరిగింది.
ఇక రానా విషయానికొస్తే..మిహీకా బజాజ్ తో ప్రేమలో పడినట్లు చెప్పిన రెండు మూడ్రోజులకే ఇరు కుటుంబాలు కలిసి..వారి ఎంగేజ్ మెంట్, పెళ్లి విషయాలపై చర్చించారు. పెళ్లికి ఆగస్టు 8వ తేదీన ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ ఆ లోపు ఎంగేజ్ మెంట్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. త్వరలోనే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా జరగవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి.
మెగా వారింట్లో త్వరలోనే పెళ్లి సందడి మొదలవ్వబోతోంది. మెగా బ్రదర్, మెగా వారింటి ఆడపడుచు నిహారిక కు స్వయంగా చిరంజీవినే సంబంధం తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో తెలిసిన ఫ్యామిలీ అవ్వడంతో గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక వివాహం నిశ్చయమయింది. పెళ్లికి ఇంకా డేట్స్ ఫిక్స్ అవ్వలేదు కానీ.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆగస్టులో వీరి నిశ్చితార్థం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి విషయానికొస్తే.. డిసెంబర్ లో చేయాలనుకుంటున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీరి పెళ్లి వచ్చే ఏడాదే జరగవచ్చని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.